ఇప్పుడు చర్చ మొత్తం రాష్ట్రపతి ఎన్నికలపైనే.. అధికార కూటమి అభ్యర్థి ఎవరు? అనే చర్చ ఓవైపు జరుగుతుంటే.. ప్రతిక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎవరు? ఈ రోజు తేలిపోనుందా? అనే చర్చ సాగుతోంది.. విపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాయి.. అందులో భాగంగా టీఎంసీ సుప్రీం, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఇవాళ విపక్షాలతో సమావేశం కానున్నారు.. అయితే, ఈ భేటీకి దూరంగా ఉంటున్నట్టు తెలంగాణ సీఎం కేసీఆర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.. మరోవైపు విపక్షాల అభ్యర్థి రేసులో ప్రధానంగా రెండు పేర్లు వినిపిస్తున్నాయి.. అందులో ఒకరు సీనియర్ పొలిటిషన్ శరద్ పవార్ అయితే.. మరొకరు మహాత్మా గాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ.. రాబోయే రాష్ట్రపతి ఎన్నికలకు గోపాలకృష్ణ గాంధీ పేరును వామపక్షాలు సూచించినట్టుగా తెలుస్తోంది.
Read Also: Gold Price: పసిడి ప్రేమికులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన ధర
రాష్ట్రపతి ఎన్నికలకు గోపాల కృష్ణ గాంధీ పేరును వామపక్షాలు సూచించగా.. ఈ విషయంపై ఆలోచించేందుకు సమయం కావాలని కోరినట్టుగా తెలుస్తోంది.. శరద్ పవార్‌తో మంగళవారం జరిగిన సమావేశంలో వామపక్షాలు.. పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ పేరును సూచించినట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతుండగా.. శరద్ పవార్ సిద్ధంగా లేకపోతే గోపాల కృష్ణ గాంధీ పేరును ప్రతిపాదించాలనే ఆలోచన చేస్తున్నారట. ఇక, ఈ వార్తలపై ఓ జాతీయ మీడియాతో స్పందించిన గోపాలకృష్ణ గాంధీ.. నా పేరుపై ఏకాభిప్రాయం ఏర్పడితే.. అభ్యర్థిగా పరిగణించాలా అని నన్ను అడిగారు.. ఈ ముఖ్యమైన సూచన గురించి ఆలోచించడానికి నాకు కొంత సమయం కావాలి చెప్పినట్టు తెలిపారు. అందరితో సంప్రదింపులు జరుగుతున్నాయి.. ఈ సమయంలో దీనిపై మాట్లాడలేను అన్నారు.
కాగా, గోపాలకృష్ణ గాంధీ.. 2017లో భారత ఉపరాష్ట్రపతి పదవికి ఏకాభిప్రాయంతో ప్రతిపక్షాల అభ్యర్థిగా బరిలోకి దిగినా.. ఎం వెంకయ్య నాయుడు చేతిలో ఓడిపోయారు. ఈ 77 ఏళ్ల మాజీ బ్యూరోక్రాట్ దక్షిణాఫ్రికా మరియు శ్రీలంకకు భారత హైకమిషనర్‌గా కూడా పనిచేశారు. ఆయన మహాత్మా గాంధీ మరియు సి రాజగోపాలాచారి మనవడు.. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై చర్చించేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వివిధ ప్రతిపక్ష పార్టీల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.. అయితే, కొందరు నేతలు శరద్ పవార్ పేరును ప్రతిపాదించగా.. ఆయన పోటీ చేయడానికి నిరాకరించారని తెలుస్తుంది. ఇక, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వారసుడిని ఎన్నుకునేందుకు జులై 18వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. గత రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థి మీరా కుమార్‌పై రామ్‌నాథ్ కోవింద్ విజయం సాధించిన విషయం తెలిసిందే.