NTV Telugu Site icon

Satyapal Malik: మహారాష్ట్ర బీజేపీ “శవపేటిక”కు చివరి మేకు అవుతుంది.

Satyapal Malik

Satyapal Malik

Satyapal Malik: జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మరోసారి బీజేపీపై విరుచుకుపడ్డారు. బీజేపీ శవపేటికకు మహారాష్ట్ర చివరి మేకు అవుతుందని ముంబైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో శనివారం అన్నారు. రాబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఖచ్చితంగా ఓడిపోతుందని జోస్యం చెప్పారు. హర్యానాలో పాటు మహారాష్ట్రకు కూడా ఎన్నికలు జరగాల్సి ఉందని, అయితే ఓటమి భయంతోనే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల మాదిరిగానే వీటిని కూడా వాయిదా వేశారని మాలిక్ అన్నారు.

Read Also: EY Employee Death: అన్నా సెబాస్టియన్ మరణంపై నివేదిక కోరిన హ్యుమన్ రైట్స్ సంస్థ..

బీజేపీ వ్యవసాయాన్ని, ఉపాధిని అంతం చేయాలని చూస్తున్నారు, అయితే ఈ దేశ ప్రజలు వారి పాలనను అంతం చేస్తారని, మహారాష్ట్రపై తనకు చాలా ఆశలు ఉన్నాయని, ఈ రాష్ట్రం దేశానికి మార్గాన్ని చూపిస్తుందని చెప్పారు. రైతుల నిరసన, పుల్వామా ఘటనపై బీజేపీ తీరుని సత్యపాల్ మాలిక్ గతంలో విమర్శించారు. ఇంటెలిజెన్స్ తప్పిదాల వల్లే ఈ ఘటన జరిగిందని తాను చెబితే, ప్రధాని మోడీ, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ తనను మౌనంగా ఉండాలని కోరారని, ఈ ఘటనపై వారు దర్యాప్తు చేస్తారని అనుకున్నా, కానీ దానిని ప్రధాని ఎన్నికల అంశంగా మార్చారని చెప్పారు. కనీసం ఇప్పటికైనా కేంద్రం విచారణ జరిపించి, మన జవాన్లకు న్యాయం చేయాలని కోరారు. పుల్వామా దాడుల గురించి ప్రశ్నించడంతోనే తనపై , తన వాళ్లపై సీబీఐ, ఈడీలు దాడి చేస్తున్నాయని చెప్పొకొచ్చారు.

ఈ సమావేశంలో పాల్గొన్న శివసేన(యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ కూడా బీజేపీపై విరుచుకుపడ్డారు. ఈ రోజు మనం చూస్తున్న మోడీ 10 ఏళ్ల క్రితం నాటి మోడీ కాదని అన్నారు. గత ఎన్నికల్లో బీజేపీకి 180 సీట్లు మించవని వారికి తెలుసు, హోం మంత్రి జిల్లా కలెక్టర్ల సాయంతో ద్వారా మిగతా సీట్లు సాధించిందని ఆరోపించారు. మహారాష్ట్రలో జరిగే ఎన్నికలలో మనం గెలిచిన రోజు మోడీ ప్రధానిగా చివరి రోజు అవుతుందని, మహారాష్ట్ర ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ బీజేపీకి మద్దతు ఉపసంహరించుకుంటారని జోస్యం చెప్పాడు. 2002 గోద్రా అల్లర్లు దేశంలో మొట్టమొదటి పుల్వామా దాడి అని, మోదీ హయాంలో దేశం ఇలాంటి పుల్వామా దాడులను చూసిందని అన్నారు.