మహారాష్ట్ర సంక్షోభం దాదాపుగా ముగిసింది. తాజాగా ఈ రోజు జరిగిన బలనిరూపనలో సీఎం ఏక్ నాథ్ షిండే తన మెజారిటీని నిరూపించుకున్నారు. దీంతో బీజేపీ, ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం మహారాష్ట్రను మరో రెండున్నరేళ్ల పాటు పాలించనుంది. విశ్వాస పరీక్షలో ఏక్ నాథ్ షిండేకు మద్దతుగా 164 ఓట్లు వచ్చాయి. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉన్న మహాారాష్ట్రలో 144 మెజారిటీ కావాలి. అయితే దీని కన్నా 20 మంది సపోర్ట్ షిండే వర్గం సాధించింది. షిండే ప్రభుత్వానికి 99 ఓట్లు వ్యతిరేకంగా రాగా.. ముగ్గురు ఎమ్మెల్యేలు విశ్వాస పరీక్షకు దూరంగా ఉన్నారు.
దీంతో పాటు ఉద్ధవ్ ఠాక్రే వర్గంలోని మరో ఇద్దరు ఎమ్మెల్యేలు షిండేకు మద్దతుగా నిలిచారు. నిన్నటి వరకు ఉద్ధవ్ వర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు సంతోష్ బంగర్, శ్యాంసుందర్ షిండేలు ఏక్ నాథ్ షిండే వర్గంలో చేరిపోయారు. దీంతో ఉద్ధవ్ ఠాక్రే వర్గం మరింత డీలా పడినట్లు అయింది. బలనిరూపణ కోసం ప్రత్యేకంగా సమావేశం అయిన మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే సుధీర్ మునిగంటి వార్, శివసేన ఎమ్మెల్యే భరత్ గోగావాలే విశ్వాస పరీక్షకు ప్రతిపాదించారు. దీంతో ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యేలను లెక్కపెట్టి మెజారిటీ తేల్చారు.
Read Also:Whatsapp: వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్.. ఆన్‌లైన్‌లోనే ఉన్నా ఎవ్వరికీ తెలియదు
ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే గ్రూపును శివసేన విప్ ను గుర్తిస్తూ కొత్తగా నియమించిన అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్ నిర్ణయం తీసుకోవడాన్ని శివసేన ఉద్ధవ్ వర్గం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఠాక్రే వర్గం తరుపును సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ సుప్రీం కోర్టులో తన వాదనలు వినిపించారు. కొత్తగా వచ్చిన స్పీకర్ విప్ ను గుర్తించే అధికారం లేదని.. ఈ చర్య సుప్రీం కోర్టు విచారణ యథాస్థితిని మారుస్తుందని వాదించారు. అయితే మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై దాఖలైన అన్ని పిటిషన్లను ఈనెల 11న విచారిస్తామని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది.