ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో తీవ్ర సంక్షోభం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌లో పొదుపు మంత్రం ఆంక్షలు అమలవుతున్నాయి. ఇలాంటి తరుణంలో దోపిడీ దొంగలు చెలరేగిపోతున్నారు. మొన్నటికి మొన్న తెలంగాణలోని కరీంనగర్‌లోని ఓ జువెలరీ షాపులో పట్టపగలే దొంగలు చెలరేగిపోయారు. తుపాకీలు చూపించి నగలు దోచుకెళ్లారు. తాజాగా మహారాష్ట్రలోని నాసిక్‌లో కూడా దొంగలు చెలరేగిపోయారు. కానీ సిబ్బంది మాత్రం.. దుండగులతో వీరోచితంగా పోరాడి.. దొంగలను ఉరికించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో శుక్రవారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో హిరావాడి ప్రాంతంలో ఉన్న “న్యూ సమృద్ధి జ్యువెలర్స్” షాపులోకి నలుగురు దుండగులు తుపాకీలతో వచ్చి సిబ్బందిని బెదిరించి దోపిడీకి యత్నించారు. అంతే వెంటనే సిబ్బంది ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వీరోచితంగా పోరాడారు. దీంతో దుండగులు తోక ముడిచి పరారయ్యారు. ఈ ఘటన మహారాష్ట్రలో సంచలనం సృష్టించింది.
పోలీసుల వివరాల ప్రకారం.. ముఖాలకు మాస్కులు, తలలకు క్యాప్‌లు ధరించిన నలుగురు దుండగులు ఒక్కసారిగా దుకాణంలోకి దూసుకొచ్చారు. వారిలో ఒకరు హెల్మెట్ కూడా ధరించి ఉన్నాడు. తమ గుర్తింపును దాచేందుకు ముందుగానే పక్కా ప్లాన్‌తో వచ్చినట్లు తెలుస్తోంది. దుకాణంలో ముగ్గురు సిబ్బంది పనిచేస్తుండగా.. దుండగుల్లో ఒకరు వెంటనే తుపాకీ తీసి వారిపై గురిపెట్టాడు. దీంతో ఒక ఉద్యోగి దాక్కోడానికి ప్రయత్నించగా.. మిగతా ఇద్దరు మాత్రం ధైర్యంగా దుండగులను ఎదుర్కొన్నారు. సీసీటీవీ వీడియోల్లో కనిపించిన దృశ్యాల ప్రకారం.. ఇద్దరు ఉద్యోగులు దుండగులతో తీవ్రంగా పోరాడారు. ఈ క్రమంలో దుండగులు ఒక ఉద్యోగిపై తుపాకీ బట్‌తో పలుమార్లు తలపై దాడి చేశారు. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఉద్యోగిని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఉద్యోగుల ప్రతిఘటనతో దోపిడీదారులు చివరకు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు.
Armed robbers open fire during attempted jewelry shop robbery in Nashik pic.twitter.com/pm21MHWEUl
— contentkikamii (@contentkikamii) May 16, 2026
