Maharashtra Elections: మహారాష్ట్ర ఎన్నికలు ముగిశాయి. 288 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీ నేతృత్వంలోని ‘‘మహాయుతి’’ కూటమి గెలుస్తుందని అంచనా వేశాయి. ఇదిలా ఉంటే, ఇంకా ఫలితాలు రాకముందే ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)లో సీఎం అభ్యర్థిపై కొట్లాట మొదలైంది. కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ నానా పటోలే, శివసేన (ఠాక్రే) ఎంపీ సంజయ్ రౌత్ మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది.
Read Also: Russia-Ukraine War: రాజుకున్న యుద్ధం.. ఉక్రెయిన్‌పై అణు రహిత క్షిపణి ప్రయోగం
కాంగ్రెస్ నేతృత్వంలోని ఎంపీఏ కూటమి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, కాంగ్రెస్ నాయకుడే సీఎం అవుతాడంటూ గురువారం ఏర్పాటు చెప్పారు. సంజయ్ రౌత్ ఈ వాదనలపై ప్రతిస్పందిస్తూ కాంగ్రెస్ నాయకుడు తదుపరి ముఖ్యమంత్రి అవుతారని తాను నమ్మడం లేదని, ఎన్నికల ఫలితాల తర్వాత చర్చించిన తర్వాతే ఎంవీఏ తన సీఎంని నిర్ణయిస్తుందని అన్నారు. పటోలేని సీఎం చేయాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లైతే రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, ఖర్గే ఆయన పేరును అధికారికంగా ప్రకటించాలని సవాల్ చేశారు.
మహారాష్ట్రలో రెండు కూటములు కూడా అధికారం ఏర్పాటు చేస్తామనే ధీమాతో ఉన్నాయి. బుధవారం వెలువడిన చాలా ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీ, శివసేన (షిండే వర్గం), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్)తో కూడిన మహాయుతి అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది. అయితే, ఎంవీఏ నేతలు మాత్రం ఈ అంచనాలను తోసిపుచ్చారు. తాము 160 సీట్లు గెలుచుకుంటామని, ఎంవీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సంజయ్ రౌత్ ధీమా వ్యక్తం చేశారు.