మహారాష్ట్రలో ఉద్ధవ్ సారథ్యంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కూలిపోతున్న తరుణంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎప్పటి నుంచో ఔరంగాబాద్, ఉస్మానాబాద్ పేర్లు మార్చాలని వస్తున్న డిమాండ్లతో ఈ రెండు నగరాల పేర్లను మారుస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ వ్యవహారంపై ఎంఐఎం పార్టీ ఉద్ధవ్ ఠాక్రేపై విమర్శలు గుప్పిస్తోంది.
బుధవారం సాయంత్రం 5 గంటలకు సీఎం ఉద్ధవ్ ఠాక్రే క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఈ సమయంలోనే ఈ రెండు నగరాల పేర్లను మారస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. శివసేన గతం నుంచి ఔరంగాబాద్ పేరును మార్చాలని ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఔరంగాబాద్ పేరును శంభాజీనగర్ గా, ఉస్మానాబాద్ పేరును ధరాశివ్ గా మార్చారు. దీంతో పాటు నవీ ముంబై విమానాశ్రయ పేరును డీబీ పాటిల్ అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చారు.
ఉద్ధవ్ ఠాక్రే నిర్ణయంపై ఎంఐఎం ఫైర్ అవుతోంది. ఉద్ధవ్ ఠాక్రే చౌకబారు రాజకీయాలకు గొప్ప ఉదాహరణ ఇదే అని ఎంఐఎం ఔరంగాబాద్ ఎంపీ ఇంతియాజ్ జలీల్ విమర్శించారు. వారు అధికారం కోల్పోతున్న సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నారని.. పేర్లను మార్చగలరు కానీ, చరిత్రను మార్చలేరని ఆయన అన్నారు. ఔరంగాబాద్ కు ఏ పేరు ఉండాలో ప్రజలు నిర్ణయించగరని ఆయన అన్నారు.