Maharashtra Elections 2024: మహారాష్ట్ర ఎన్నికల వైపు దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. నవంబర్ 20న ఆ రాష్ట్రంలోని 288 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. నవంబర్ 23న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ ఎన్నికల్లో రెండు ప్రధాన కూటములు పోటీ పడుతున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్సీపీ, శివసేన కూటమి ‘మహాయుతి’, కాంగ్రెస్ నేతృత్వంలోని శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేల ‘‘మహా వికాస్ అఘాడీ’’ కూటములు పోటీలో ఉన్నాయి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో అభ్యర్థులంతా తమతమ నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
Read Also: Free Bus: మహిళలకు ‘ఫ్రీ బస్’పై కర్ణాటక సర్కార్ పునరాలోచన..
అయితే, తాజాగా చండీవాడీ ఎమ్మెల్యే దిలీప్ లాండే ఇచ్చిన హామీ వివాదాస్పదంగా మారింది. గతంలో రూ. 12.50 కోట్ల ప్రెజర్ కుక్కర్ స్కాన్‌లో ఆరోపణలు ఎదుర్కొంటోన్న లాండే, తాను గెలిస్తే తన నియోజకవర్గంలోని మహిళలకు జ్యూసర్లు మిక్సర్లు పంపిణీ చేస్తానని ప్రకటించారు. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమే అని ఆరోపిస్తూ న్యాయవాది నిఖిల్ కాంబ్లే బుధవారం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాడు. మహిళా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు గృహోపకరణాలు పంపిణీ చేస్తానని వాగ్దానం చేయడం ద్వారా చండీవలి నియోజకవర్గంలోని ఓటర్లను అనవసరంగా ప్రభావితం చేయడమే లాండే లక్ష్యమని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎంసీసీ)కి విరుద్ధంగా ఉందని ఆరోపించారు.