మధ్యప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. వేటగాళ్ల కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మరణించిన విషాదకర సంఘటన చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ గుణ జిల్లాలోని సాగా బర్ఖెగా గ్రామంలో అటవీ ప్రాంతంలో ఘటన జరిగింది. శుక్రవారం రాత్రి కృష్ణజింకలను వేటాడుతున్నారనే పక్కా సమాచారంతో వేటగాళ్లను పట్టుకునేందుకు వెళ్లారు. ఈ సమయంలో వేటగాళ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సబ్ ఇన్ స్పక్టర్ రాజ్ కుమార్ జాతవ్, హెడ్ కానిస్టెబుల్ సంత్ రామ్ మీనా, కానిస్టేబుల్ నీరజ్ భార్గవ మరణించారు. ఘటన జరిగిన ప్రాంతం రాజధాని భోపాల్ నుంచి 160 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆరోన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి.
ఈ ఘటనపై మధ్య ప్రదేశ్ సర్కార్ సీరియస్ అయింది. ఘటనను తీవ్రంగా పరిగణించింది శివరాజ్ సింగ్ చౌహాన్ సర్కార్. నిందితులను విడిచిపెట్టబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా అన్నారు. గుణా సమీపంలో ముగ్గురు పోలీసులు వీరమరణం పొందారని… స్వయంగా సీఎం శివరాజ్ సింగ్ ఈ కేసును పర్యవేక్షిస్తున్నారని నరోత్తమ్ మిశ్రా వెల్లడించారు.
ఈ ఘటనపై సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తన నివాసంలో శనివారం ఉదయం 9.30 గంటలకు ఉన్నత స్థాయి అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. డీజీపీతో పాటు హోమంత్రి, ప్రధాన కార్యదర్శి సహా సీనియర్ పోలీస్ అధికారులు హాజరయ్యారు. మరణించిన పోలీస్ కుటుంబాలకు సీఎం కోటి రూపాయల పరిహారం ప్రకటించారు.