NTV Telugu Site icon

Madhya Pradesh: భోజ్‌శాల ఆలయం-కమల్ మౌలా మసీదుపై రేపటి నుంచి ఏఎస్ఐ సర్వే..

Bhojshala Temple

Bhojshala Temple

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌ ధార్‌లోని వివాదాస్పద భోజ్‌శాల ఆలయం కాంప్లెక్స్ ఆలయంలో రేపటి నుంచి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) సర్వే ప్రారంభించనుంది. మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు భోజ్‌శాల-కమల్ మౌలా మసీదు ప్రాంగణంలో సర్వే చేపట్టనున్నట్లు ఏఎస్ఐ గురువారం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నెల ప్రారంభంలో భోజ్‌శాల ఆలయం, కమల్ మౌలా మసీదు ‘మల్టీ డిసిప్లినరీ సైంటిఫిక్ సర్వే’ సర్వే చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ వివాదం గతంలో మతఘర్షణలకు కారణమైంది. రెండు వర్గాలు కూడా దీనిపై తమకే హక్కులు ఉన్నాయని క్లెయిమ్ చేసుకుంటున్న తరుణంలో ఈ వివాదాస్పద ప్రాంతం నిజ స్వరూపం, స్వభావాన్ని నిర్ధారించేందుకు హైకోర్టు ఆదేశించింది. ఏఎస్ఐ సర్వే నేపథ్యంలో ధార్ ఎస్పీ మనోజ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. సర్వే పనులకు అందరూ సహకరించాలని ధార్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సర్వే పనుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

Read Also: Actress Accident: ఇంకా విషమంగానే జయలక్ష్మీ ఆరోగ్యం.. విరాళాల కోసం కుటుంబం ఎదురు చూపులు!

హిందూ ఫ్రంట్ ఫర్ జస్టిస్ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు ఎస్ఏ ధర్మాధికారి, దేవనారాయణ్ మిశ్రాలతో కూడిన డివిజన్ బెంచ్, ఐదుగురు సీనియర్ అధికారులతో కూడిన ప్యానెల్ ఏర్పాటు చేయాలని ఏఎస్ఐని ఆదేశించింది. ఆరువారాల్లో నివేదిక సమర్పించాలని కోరింది. భోజ్‌శాలను సరస్వతి ఆలయంగా హిందువులు భావిస్తున్నారు, 11వ శతాబ్ధానికి చెందిన స్మారక చిహ్నాలను ఏఎస్ఐ రక్షిస్తోంది. ఇదిలా ఉంటే ముస్లిం వర్గం దీనిని మసీదుగా పేర్కొంటోంది. ఏప్రిల్ 2003 నుంచి ఏఎస్ఐ ఆదేశాల మేరకు హిందువులు మంగళవారం పూజలు నిర్వహిస్తుంటే, శుక్రవారం ముస్లింలు నమాజ్ చేస్తున్నారు. కోర్టు విచారణలో 1958 మాన్యుమెంట్స్ చట్టంలోని సెక్షన్ 16పై దృష్టి సారించింది. ఇది ప్రార్థనా స్థలాల దుర్వినియోగం, అపవిత్రం నుంచి రక్షణ ఇచ్చేందుకు సంబంధించినది. ప్రాథమికతను నిర్ణయించడానికి ప్రార్థనా స్థలం యొక్క స్వభావాన్ని నిర్ణయించడం చాలా అవసరం అని కోర్టు పేర్కొంది.