NTV Telugu Site icon

Congress: బెంగాల్‌లో కాంగ్రెస్‌కి అవమానం.. ఖర్గే పోస్టర్లపై ఇంక్ దాడి..

Kharge

Kharge

Congress: ఇండియా కూటమికి బయట నుంచి మద్దతు ఇస్తానని ఇటీవల బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించింది. అయితే, ఆమె ప్రకటనపై బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధిర్ రంజన్ చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె విధేయతను ప్రశ్నించడంతో పాటు ఆమెపై తనకు నమ్మకం లేదని అన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అసంతృప్తి వ్యక్తం చేసిన ఒక రోజు తర్వాత బెంగాల్ వ్యాప్తంగా కాంగ్రెస్‌కి అవమానం జరిగింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉన్న అనేక పోస్టర్లు, హోర్డింగులపై ఇంక్ దాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు పోస్టర్లలో ఖర్గే ముఖానికి సిరా పూశారు. ‘‘తృణమూల్ కాంగ్రెస్ ఏజెంట్’’ అని రాశారు. ఈ ఘటనపై అధిర్ రంజన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలని పార్టీ కార్యకర్తలను ఆదేశించారు. దీనిపై ఫిర్యాదు నమోదైంది. ధ్వంసం చేసిన పోస్టర్లను తొలగించారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

Read Also: Breaking: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ క్రాష్.. హర్డ్ ల్యాండింగ్ అయినట్లు అనుమానం..

శనివారం రాత్రి ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఖర్గే, అధిర్ రంజర్ మధ్య విభేదాలు సృష్టించాలని టీఎంసీ ఇలా చేసి ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. మమతపై అధిర్ రంజన్ విమర్శిలపై ఖర్గే స్పందిస్తూ.. ‘‘మమతా బెనర్జీ కూటమితోనే ఉన్నారు.. ప్రభుత్వంలో చేరతామని ఇటీవలే చెప్పారు. అధిర్ రంజన్ చౌదరి నిర్ణయం తీసుకోరు. నేనే, హైకమాండ్ నిర్ణయం తీసుకుంటామని, అంగీకరించని వారు బయటకు వెళ్తారు.’’ అని అన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఇండియా కూటమి అధికారంలోకి తర్వాత కూటమిలో భాగం అవ్వాలా..? వద్దా..? అనేదానిపై అధిర్ రంజన్ నిర్ణయం తీసుకోరని ఆయన అన్నారు.

అంతకుముందు అధిర్ రంజన్, మమతా బెనర్జీని ఉద్దేశించి మాట్లాడుతూ.. బెంగాల్‌లో నన్ను, మా పార్టీని రాజకీయంగా అంతం చేయాలనుకునే వ్యక్తికి నేను అనుకూలంగా మాట్లాడలేను, ఇది ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త కోసం పోరాటం, రాష్ట్ర కాంగ్రెస్‌ని ఆమె వ్యక్తిగత ఎజెండా కోసం ఉపయోగించుకోవడం నాకు ఇష్టం లేదు అని అన్నారు. ఖర్గే నా అభిప్రాయానికి వ్యతిరేకంగా మాట్లాడితే, రాష్ట్రంలోని అట్టడుగు స్థాయి కాంగ్రెస్ కార్యకర్త కోసం నేను మాట్లాడుతుతాను అని అన్నారు. బెంగాల్‌లో టీఎంసీ ఒంటరిగా పోటీ చేస్తుండగా, కాంగ్రెస్-వామపక్షాలు పొత్తులో పోటీ చేస్తున్నాయి.