ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నో నగరంలో అద్దెకు నివసించిన యువతి ప్రియుడు తన సహచరులతో కలిసి ఇంటి యజమానిపై దాడి చేసి భారీ మొత్తంలో నగదు, బంగారు ఆభరణాలను దోచుకెళ్లిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో బాధితుడిని జల్ నిగమ్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న పింటు శర్మను పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటన పారా పోలీస్ స్టేషన్ పరిధిలోని బుధేశ్వర్ ప్రాంతంలోని ఆదర్శ్ విహార్ కాలనీలో జరిగింది. పింటు శర్మ తన ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో నలుగురు యువకులు తలుపు తట్టారు. ఆయన చిన్న గేటు తెరవగానే, వారు బలవంతంగా ఇంట్లోకి చొరబడ్డారు. నిందితుల చేతుల్లో పిస్టల్స్ ఉండగా, పింటు శర్మ తల వెనుక భాగంపై తీవ్రంగా దాడి చేయడంతో అతనికి తీవ్ర రక్తస్రావం జరిగింది.
తమ మాట వినకపోతే కాల్చివేస్తామని బెదిరించిన నిందితులు అల్మారా తాళాలను లాక్కొని తెరిచారు. అందులో ఉన్న రూ.5 లక్షల నగదు, సుమారు 1.5 తులాల బంగారు గొలుసు, 7 గ్రాముల బంగారు ఆభరణాలను దోచుకెళ్లినట్లు బాధితుడు పోలీసులకు తెలిపాడు. దోపిడీ అనంతరం ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ చెల్లాచెదురుగా పడేసి నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.
పింటు శర్మ ఇచ్చిన ఫిర్యాదులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. శకుంతల విశ్వవిద్యాలయంలో చదువుతున్న భారతి అనే యువతి తన ఇంటి రెండో అంతస్తులో అద్దెకు నివసించేదని తెలిపారు. అద్దె చెల్లించకపోవడంతో ఇటీవల ఆమెతో వివాదం ఏర్పడిందని, ఐదు నుంచి ఆరు రోజుల క్రితం గదిని ఖాళీ చేయించామని చెప్పారు. అద్దె చెల్లించిన తరువాత తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆమెకు చెందిన రిఫ్రిజిరేటర్‌ను ఇంట్లోనే ఉంచినట్లు వివరించారు.
ఈ దాడికి భారతి ప్రియుడు అనుజ్ ప్రధాన నిందితుడని పింటు శర్మ ఆరోపించాడు. అనుజ్ తరచూ తన ఇంటికి వచ్చేవాడని, అందువల్ల అతడిని స్పష్టంగా గుర్తించగలిగానని పేర్కొన్నాడు. మరో నిందితుడిగా మాలిక్‌ను కూడా గుర్తించినట్లు తెలిపాడు. ఘటన సమయంలో ఇద్దరు యువకులు ఇంటి బయట కాపలా కాస్తూ ఉన్నారని సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.