NTV Telugu Site icon

Asaduddin Owaisi: మోడీ కాదు ఆయనే పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాలి.. అలా అయితేనే వస్తాం..

Asaduddin Owaisi

Asaduddin Owaisi

Asaduddin Owaisi: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. మే 28న ప్రధాని నరేంద్రమోడీ కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించనున్నారు. అయితే ప్రధాని మోడీ పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించడాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. రాజ్యాంగపదవిలో ఉన్న, భారతదేశ ప్రథమ పౌరురాలు అయిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆమెను ఆహ్వానించకుండా రాష్ట్రపతిని అవమానిస్తున్నారంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు, డీఎంకే, శివసేన(ఉద్ధవ్), టీఎంసీ వంటి 19 విపక్ష పార్టీలు ఈ కార్యక్రమానికి రాబోమని ప్రకటించాయి.

Read Also: Congress : ఎల్లుండి ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశం..

ఇదిలా ఉంటే ఈ అంశంపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. కొత్త భవనాన్ని ప్రధాని మోడీ కాదని, పార్లమెంట్ స్పీకర్ ఓంబిర్లా ప్రారంభించాలని ఆయన అన్నారు. అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించాలనే వాదనతో తాను ఏకీభవించడం లేదని ఓవైసీ అన్నారు. కొత్త పార్లమెంట్ భవనం అవసరమని, దాన్ని ఎవరూ కాదనలేరని, ప్రధాని మోడీ ప్రారంభించడాన్ని మాత్రమే తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు.

ప్రతిపక్షాలు తనను సంప్రదించలేదని, అయితే కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలని వారు చెబుతున్నది రాజ్యాంగం ప్రకారం సరికాదని, స్పీకర్ లోక్ సభ సంరక్షకుడు అని, కొత్త పార్లమెంట్ భవనాన్ని స్పీకర్ ప్రారంభించాలని, ప్రధాని మోదీ ఈ విషయంలో వెనక్కి తగ్గాలని ఓవైసీ అన్నారు. అలా అయితేనే ఈ వేడుకలకు హాజరవుతాం అని ఓవైసీ బుధవారం అన్నారు. కొత్త పార్లమెంట్ భవనం లోక్ సభలో 888 మంది, రాజ్యసభలో 300 మంది వరకు సౌకర్యవంతంగా కూర్చునేలా నిర్మించారు. ఉభయసభల్లో మొత్తంగా 1280 మంది సభ్యులు కూర్చునేందుకు అనువుగా భవనాన్ని నిర్మించారు. ప్రధాని మోడీ దీనికి డిసెంబర్ 2020లో శంకుస్థాపన చేశారు. మే 28న ఈ భవనాన్ని ప్రారంభించనున్నారు.