Loan App: లోన్ యాప్ వేధింపులు రోజు రోజుకు పెరిగి పోతున్నాయి. లోన్ యాప్ ఏజెంట్లు మరీ బరితెగించి వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లి ఇబ్బందులకు గురి చేస్తుండటంతో లోన్ తీసుకున్న బాధితులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇందులో ఎక్కువగా విద్యార్థులే ఉంటున్నారు. విద్యార్థులతోపాటు.. ఇతరులు కూడా లోన్ యాప్ వేధింపులకు బలి అవుతున్నారు. లోన్ యాప్ ఏజెంట్లు మహిళలను సైతం వేధింపులకు గురి చేస్తున్నారు. మహిళలు కూడా లోన్ యాప్ ఏజెంట్ల వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. కొందరు మాత్రం ధైర్యం చేసి.. పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా బెంగళూరులో ఇంజనీరింగ్ విద్యార్థి లోన్ యాప్ ఏజెండ్ల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Read also: Student Suicide: నా పిల్ల నన్ను మోసం చేసింది.. ‘అమ్మా సారీ’ అంటూ సెల్ఫీ వీడియో..!
లోన్ యాప్ కారణంగా ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన బెంగళూరు లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంజినీరింగ్ విద్యార్థి తేజష్ (22) లోన్ యాప్ ద్వారా రూ.46,000 రుణం తీసుకున్నాడు. తిరిగి చెల్లించే విషయంలో విఫలం కావడంతో లోన్ యాప్ ఏజెంట్లు వేధింపులకు దిగారు. దీంతో వారి వేధింపులు తాలలేక తేజష్ జీవితం చాలించాడు. మంగళవారం సాయంత్రం జాలహళ్లిలోని హెచ్ఎంటీ లే అవుట్ లోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై మృతుడి తండ్రి గోపీనాథ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తేజష్ ఏడాదిన్నరగా ఈ లోన్ యాప్ లను వినియోగిస్తున్నట్లు అతడి తండ్రి గోపీనాథ్ తెలిపారు. 20 రోజుల క్రితమే తనకు ఈ విషయం తెలిసిందని.. దీంతో ఈఎంఐ చెల్లించేందుకు కొంత డబ్బు సాయం చేసినట్లు చెప్పాడు. మంగళవారం కళాశాల లేకపోవడంతో ఇంట్లోనే ఉన్నాడని గోపీనాథ్ పేర్కొన్నాడు. తన కూతుర్ని ట్యూషన్ వద్ద దింపి వచ్చే సరికి జరగరాని ఘోరం జరిగిపోయిందని వాపోయాడు. విగతజీవిగా ఉన్న కుమారుడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే తేజష్ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. గోపీనాథ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. తాజా ఘటనతో పోలీసులు నగరంలో పెరుగుతున్న లోన్ యాప్ మోసాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. సులభంగా లభించే రుణాల కోసం ప్రజలు ఆశపడి మోసపోవద్దని హెచ్చరిస్తున్నారు. అనధికారిక యాప్ లను డౌన్ లోడ్ చేయడం.. తెలియని లింక్ లను యాక్సెస్ చేయడం వంటివి చేయొద్దని పోలీసులు ప్రజలకు చెబుతున్నారు.