మహారాష్ట్రలో నవంబర్ 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీలు పోటాపోటీగా తలపడుతున్నాయి. ఓ వైపు ఇండియా కూటమి.. ఇంకోవైపు ఎన్డీఏ కూటమి నువ్వానేనా? అన్నట్టుగా సై అంటున్నాయి. అయితే ఎన్నికల ప్రచారంలో ఎన్‌సీపీ చీఫ్ అజిత్ పవార్ వర్గం.. శరద్‌పవార్ ఫొటోలు, వీడియోలు ఉపయోగిస్తోంది. దీనిపై శరద్ పవార్ వర్గం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విచారణ చేపట్టిన ధర్మాసనం.. అజిత్ పవార్ వర్గానికి చురకలు వేసింది. శరద్ పవార్ ఫొటోలు, వీడియోలు ఉపయోగించొద్దని సూచించింది. సొంతకాళ్లపై నిల్చోవడం నేర్చుకోవాలని హితవు పలికింది.
ఇది కూడా చదవండి: IPL 2025 GT: బ్యాటింగ్, అసిస్టెంట్ కోచ్‌గా పార్థివ్ పటేల్‌ను నియమించుకున్న గుజరాత్ టైటాన్స్
మహారాష్ట్రలో ఎన్‌సీపీ నుంచి చీలిపోయి మెజార్టీ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ-ఏక్‌నాథ్ షిండే సర్కారుకు అజిత్ పవార్ మద్దతు పలికి డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయన వర్గానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు మంత్రులయ్యారు. దీంతో పార్టీ రెండుగా చీలిపోగా.. అజిత్ పవార్ వర్గాన్నే అసలైన ఎన్‌సీపీగా ఎన్నికల సంఘం గుర్తించింది. అసెంబ్లీలో ఎక్కువమంది ఎమ్మెల్యేలు కలిగిన అజిత్ పవర్ వర్గమే పార్టీ చిహ్నం, ఎన్నికల గుర్తును దక్కించుకుంది. అయితే ప్రస్తుతం జరుగుతోన్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీనియర్ శరద్ పవార్ దృశ్యాలను వాడుతున్నారని ఆరోపిస్తూ ఆయన మద్దతుదారులు సుప్రీంను ఆశ్రయించారు. ఈ క్రమంలో సుప్రీం ధర్మాసనం తాజా ఆదేశాలు జారీ చేసింది. ‘‘మీ సొంత కాళ్ళపై నిలబడటం నేర్చుకోండి..’’ అని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
ఇది కూడా చదవండి: Jharkhand Polls: జార్ఖండ్‌లో ముగిసిన తొలి విడత ఓటింగ్.. పోలింగ్ శాతమెంతంటే..!
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20న జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 23న విడుదల కానున్నాయి. మరోసారి అధికారం కోసం ఎన్డీఏ కూటమి ప్రయత్నిస్తుండగా.. అధికారం చేజిక్కించుకోవాలని ఇండియా కూటమి ప్రయత్నిస్తుంది. ప్రజలు ఎవరికి అధికారం కట్టబెడతారో వేచి చూడాలి.
ఇది కూడా చదవండి: JIO Data Recharge: జియో కస్టమర్స్‌కు బంపర్ ఆఫర్.. రూ.11కే 10జిబి డేటా