Rahul Gandhi: అంతర్జాతీయంగా ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య వివాదం హాట్ టాపిక్‌గా మారింది. మెలోనీ నాతో ఫోటో దిగేందుకు బ్రతిమిలాడిందని, ఇటలీలో ఆమె పాపులారిటీ పడిపోతుందని, దానిని పెంచుకునే ప్రయత్నంలో ఇలా చేసిందని ట్రంప్ ఆరోపించారు. దీనికి మెలోనీ కూడా ఘాటుగానే స్పందించింది. నా పాపులారిటీ గురించి మీ సమస్య కాదని, ముందు మీ పాపులారిటీ గురించి చూసుకోండని ట్రంప్‌కు ఇచ్చి పడేసింది. ఇంతే కాకుండా, మిత్ర దేశాల పట్ల ట్రంప్ ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారనేది అర్థం కావడం లేదని మెలోనీ అన్నారు.
మెలోనీకి ప్రతిపక్షాల మద్దతు..
ఈ విషయంలో మెలోనీకి ఇటలీ ప్రతిపక్షాల నుంచి గట్టి సపోర్ట్ లభించింది. ఇటలీ ప్రధా ప్రతిపక్షమైన డెమోక్రటిక్ పార్టీ నాయకురాలు ఎల్లి ష్లైన్ ఆ దేశ పార్లమెంట్‌లో మాట్లాడుతూ.. మేము సభలో రాజకీయ ప్రత్యర్థులమే, కానీ ముందుగా ఇటలీ పౌరులమని, ఒక విదేశీ నేత మన దేశాన్ని, ప్రభుత్వాన్ని అవమానించడం, బెదిరించడం ఎంత మాత్రం సహించేది లేదని చెప్పారు. మరో ప్రతిపక్షం ఫైవ్ స్టార్ మూవ్‌మెంట్ పార్టీ అధినేత, మాజీ ప్రధాని గైసెప్పే కాంటే కూడా స్పందిస్తూ.. ట్రంప్ ఇలాంటి చులకన వ్యాఖ్యలు చేయడం సరికాదని ఫైర్ అయ్యారు.
రాహుల్ గాంధీ, ప్రతిపక్షాలు నేర్చుకోవాలి.
ఒక విదేశాధినేత భారత్ లేదా, భారత ప్రధానిపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మన ప్రతిపక్షాలు ఇటలీలా ప్రతిస్పందిస్తాయా? అంటే లేదని చెప్పాలి. దీనికి ఒక రాజకీయ సాకుగా వాడుకుని విదేశాధినేతల పక్షాన నిలుస్తారు. ఉదాహరణకు ఆపరేషన్ సిందూర్ సమయంలో ఇదే డొనాల్డ్ ట్రంప్ భారత విమానాలు కూలిపోయాయని, తానే మధ్యవర్తిత్వంతో యుద్ధం ఆపానని చెబితే మన ప్రతిపక్షాలు భారత్ సైన్యాన్నే అనుమానంగా చూశాయి. ముఖ్యంగా రాహుల్ గాంధీ ట్రంప్ మాటల్ని అందుకుని ‘‘మన యుద్ధ విమానాలు ఎన్ని కూలాయి.?’’ అంటూ మాట్లాడటం మొదలుపెట్టారు.
అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ట దెబ్బతినేలా ఒక విదేశీ నేత మాట్లాడితే, దానిని అడ్డుకోవాల్సింది పోయి, వారికే వంత పాడటం భారత ప్రతిపక్షాలకు అలవాటుగా మారింది. ఇక ట్రంప్ భారత ఆర్థిక వ్యవస్థను ‘‘డెడ్ ఎకానమీ’’ అన్నప్పుడు, వెంటనే రంగంలోకి దిగిన రాహుల్ గాంధీ ట్రంప్ చెప్పింది నిజమే అని కామెంట్ చేశారు. ఓ వైపు ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ వంటి ఆర్థిక సంస్థలు వృద్ధిరేటులో ప్రపంచంలోని అన్ని దేశాల కన్నా భారత్ మెరుగైన స్థితిలో ఉందని చెబుతుంటే, మన ప్రతిపక్ష నేత మాత్రం ఇలాంటి మాటలు అనడం దేశ ప్రతిష్టను దిగజార్చేదే.
బాధ్యతాయుతమైన ప్రతిపక్షాలు అధికార పక్షాల తప్పొప్పులను ఎత్తి చూపితే తప్పు లేదు. అది ప్రతిపక్షాల బాధ్యత, కానీ ట్రంప్ వంటి వ్యక్తి కామెంట్లకు కూడా స్పందించడం వంటివి చేస్తే, మన పరువును మనమే తీసుకున్నట్లు అవుతుంది. ప్రస్తుతం ట్రంప్‌ను బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్, ఇటలీ ప్రధాని మెలోనీ వంటి వారు పెద్దగా పట్టించుకోవడం లేదు. చివరకు ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ కూడా ట్రంప్ మాటల్ని వినడం లేదు. యూరప్ దేశాలు ఒక తిక్కలోడిగా ట్రంప్‌ను జమకడుతున్నాయి. అలాంటి వ్యక్తి మాటలకు భారత ప్రతిపక్షాలు స్పందిస్తున్నాయి. ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఎలా ఉండాలో ఇటలీని చూసి నేర్చుకోవాలని ప్రజలు సూచిస్తున్నారు.

