Kerala High Court: సహజీవనంపై కేరళ హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. లివ్ ఇన్ రిలేషన్ ని వివాహంగా చట్టం గుర్తించదని హైకోర్టు పేర్కొంది. వ్యక్తిగత, లౌకిక చట్టాల ప్రకారం జరిగే వివాహాలనే చట్టబద్ధ వివాహాలుగా గుర్తిస్తామని చెప్పింది. ఒప్పందం ప్రకారం సహజీవనం చేసే జంట దాన్ని వివాహంగా చెప్పలేరని, సహజీవనంలో విడాకులు కోరడం కుదరదని హైకోర్టు పేర్కొంది. చట్టాల ప్రకారం వివాహం చేసుకోలేదని, సహజీవనంలో ఉన్న జంట విడాకులు పిటిషన్ ను కేరళ హైకోర్టు కొట్టేసింది. న్యాయమూర్తులు ఏ ముహమ్మద్ ముస్తాక్, సోఫీ థామస్ లతో కూడిన బెంచ్ ఈ తీర్పును ఇచ్చింది.
Read Also: Rajnath Singh: ప్రియాంకా గాంధీ “సీజనల్ హిందువు”.. కేంద్రమంత్రి విమర్శలు..
హిందువు, క్రిస్టియన్ మతాలకు చెందిన జంట 2006 నుంచి రిజిస్టర్ అగ్రిమెంట్ ప్రకారం సహజీవనం చేస్తున్నారు. వారికి 16 ఏళ్ల కూతురు కూడా ఉంది. ఇక తమ సంబంధాన్ని కొనసాగించే ఉద్దేశం లేకపోవడంతో విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. వీరి రిలేషన్ ను పెళ్లిగా గుర్తించలేమని, వివాహ చట్టాల ప్రకారం వివాహం జరిగితేనే దాన్ని పెళ్లిగా చట్టం గుర్తిస్తుందని, ఒప్పందం ప్రకారం ఇద్దరు సహజీవనం చేస్తే దాన్ని వివాహంగా గుర్తించమని, ఇటువంటి కేసుల్లో విడాకులు అడిగే అర్హత లేదని స్పష్టం చేసింది.
కొన్ని కమ్యూనిటీల్లో అనుసరించే ఎక్స్‌ట్రా జుడిషియల్ డైవోర్స్ కూడా చట్టబద్ధమైన చట్టాల ద్వారా గుర్తింపు పొందాయని, విడాకుల అన్ని రూపాలు కూడా చట్టబద్ధమైన స్వభావాన్ని కలిగి ఉంటాయని న్యాయస్థానం పేర్కొంది. వ్యక్తిగత, వివాహ చట్టాల ప్రకారం గుర్తింపు పొందిన వివాహపద్దతుల్లో వివాహం జరిగి ఉంటేనే ఇరువురు విడాకులు తీసుకునేందుకు చట్టం అనుమతిస్తుందని జూన్ 8 రోజున కేరళ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ లో పేర్కొంది. ఈ కేసులో ఒప్పందం ద్వారా జరిగిన ఏ వివాహం అయిన చట్టం ప్రకారం గుర్తింపు పొందలేదని, విడాకులు ఇవ్వడం సాధ్యపడదని, విడాకులు కోసం పిటిషన్ స్వీకరించడానికి కుటుంబ న్యాయస్థానం అధికార పరిధిని కలిగి ఉండదని తీర్పు వెలువరించింది.