Waqf Board: మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో రైతులకు సంబంధించిన 300 ఎకరాల భూమిని ‘‘వక్ఫ్ బోర్డ్’’ క్లెయిమ్ చేయడంపై వివాదం ప్రారంభమైంది. అయితే, అక్కడి రైతులు మాత్రం ఈ భూములు తమకు తరతరాలుగా సంక్రమించాయని చెబుతున్నారు. ఇటీవల ఈ భూములు తమవే అంటూ వక్ఫ్ బోర్డు రైతులకు నోటీసులు పంపింది. 103 రైతులు నోటీసులు అందుకున్నవారిలో ఉన్నారు.
Read Also: Black magic: యూట్యూబ్‌లో క్షుద్రపూజలు.. ధనవంతులు కావాలని వ్యక్తి తల నరికి హత్య..
అయితే, ఈ వివాదంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయాన్ని ఛత్రపతి శంభాజీనగర్‌లోని మహారాష్ట్ర స్టేట్ వక్ఫ్ ట్రిబ్యునల్‌కి బాధితులు తీసుకెళ్లారు. బాధితుల్లో ఒకరైన తుకారాం కన్వటే మాట్లాడుతూ.. ఈ భూములు తమకు తరతరాలుగా సంక్రమించాయని, ఇవి వక్ఫ్ భూములు కాదని అన్నారు. తమకు న్యాయం చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కేసుపై ఇప్పటికే రెండుసార్లు విచారణ జరిగింది, తదుపరి విచారణ డిసెంబర్ 20న జరగనుంది.
వక్ఫ్ సవరణ బిల్లుని కేంద్రం తీసుకువచ్చిన ఈ సందర్భంలోనే ఈ లాతూర్ రైతుల సమస్య వెలుగులోకి వచ్చింది. భూములను క్లెయిమ్ చేసే అపరిమిత అధికారాలతో పాటు వక్ఫ్ చట్టంలోని మార్పుల కోసం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం బిల్లుని తీసుకువచ్చింది. అయితే, ప్రతిపక్షాల నుంచి దీనిపై అభ్యంతరం రావడంతో ‘‘జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)’’ని ఏర్పాటు చేసింది. జేపీపీ తన నివేదికను వచ్చే బడ్జెట్ సమావేశాల్లో సమర్పించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, ఇటీవల కర్ణాటకలో కూడా ఇలాగే రైతుల భూముల్ని వక్ఫ్ ఆస్తులుగా పేర్కొనడం వివాదాస్పదమైంది. రైతులు, ఇతర ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది.