Manipur: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రాష్ట్రపతి పాలన అమలులోకి వచ్చిన తర్వాత అక్కడ మైయిటీ, కుకీ మిలిటెంట్లు తమ ఆయుధాలను సరెండర్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈరోజు కుకీలకు, భద్రతా బలగాలకు మధ్య ఘర్షణ నెలకొంది. మణిపూర్ ప్రభుత్వం నుంచి ప్రత్యేక పరిపాలన ఏర్పాటు చేయాలనే తమ డిమాండ్ నెరవేరే దాకా రాష్ట్రంలో స్వేచ్ఛగా తిరగకూడదని కుకీలు నిరసన తెలుపుతున్నారు. రాష్ట్రంలో ‘‘ఫ్రీ మూమెంట్’’ని అడ్డుకునేందుకు కుకీలు ప్రయత్నించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ఈ రోజు భద్రత బలగాల రక్షణలో రాష్ట్రంలోని జిల్లాల్లో బస్సులు తిరగడం ప్రారంభమయ్యాయి.
Read Also: Singer Kalpana: మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌ను కలిసిన సింగర్ కల్పన.. వారిపై ఫిర్యాదు
రాజధాని ఇంఫాల్‌కి 45 కి.మీ దూరంలోని కాంగ్‌పోక్పి జిల్లాలో భద్రతా బలగాలను అడ్డుకుంటున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. రహదారిని దిగ్భంధించడానికి ప్రయత్నించిన కుకీ తెగకు చెందిన మహిళలపై భద్రతా బలగాలు లాఠీఛార్జ్ చేశాయి. ఈ ఘటనలో చాలా మంది గాయపడినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో నేటి నుంచి ఎక్కడా కూడా రోడ్డు దిగ్భంధనాలు ఉండకూడదని కేంద్రం ప్రకటించింది. అయితే, కుకీలు దీనిని అడ్డుకోవడంతో పలు ప్రాంతాల్లో ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. కుకీలు భద్రతా బలగాల వాహనాలపై రాళ్లు రువ్వడంతో పాటు రోడ్లను తవ్వడం, టైర్లను కాల్చడం, బారికేడ్లను ఏర్పాటు చేయడం వంటివి చేశారు.
మణిపూర్‌లో రెండేళ్ల క్రితం మెజారిటీ మైయిటీ, మైనారిటీ కుకీల మధ్య జాతి ఘర్షణలు మొదలయ్యాయి. అప్పటి నుంచి తమ ఆధిపత్యం కోసం ఇరు తెగలు దాడులు చేసుకుంటున్నాయి. ఈ హింసలో 250 మంది మరణించారు. దాదాపుగా 50,000 మంది నిరాశ్రయులయ్యారు. కార్యకలాపాల సస్పెన్షన్ (SoO) ఒప్పందంపై సంతకం చేసిన దాదాపు రెండు డజన్ల మిలిటెంట్ గ్రూపులు, కుకీ నాయకులు, రాష్ట్రంలో స్వేచ్ఛగా తిరగడానికి అనుమతించే ముందు తమకు ప్రత్యేక పరిపాలన ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.