KTR: ధాన్యం కుప్పల మీదే రైతన్నల చావులు.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్

  • ధాన్యం కొనుగోళ్లపై కాంగ్రెస్ సర్కార్‌కు కేటీఆర్ వార్నింగ్
  • రైతుల మరణాలపై సీఎం రేవంత్‌ను నిలదీసిన బీఆర్ఎస్ నేత
  • కేబినెట్ సమావేశంలో ధాన్యం అంశం చర్చించాలని డిమాండ్
  • పెండింగ్ కొనుగోళ్లు వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వానికి సూచన
Ktr

Ktr

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల ఆలస్యంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యవస్థలు పూర్తిగా కుప్పకూలాయని, అన్నదాతలు రోడ్డున పడుతున్నా పాలకుల్లో చలనం లేదంటూ మండిపడ్డారు.

కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కుప్పల మీదే రైతన్నలు గుండెలు ఆగి కుప్పకూలిపోతున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. “రైతులు రాలిపోతున్నా చలనం లేని రాక్షస పాలన సాగుతోంది. అన్నదాతల చావులను చూసి ఆనందిస్తున్నావా ముఖ్యమంత్రి?” అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన సూటిగా నిలదీశారు. మండుటెండల్లో ఐయక కేంద్రాల (కొనుగోలు కేంద్రాల) కాడ రైతుల గుండెలు ఆగిపోతున్నా, ఈ కర్కశ ప్రభుత్వానికి కనీసం కనికరం కలగడం లేదా అని ప్రశ్నించారు. పంటలు కొనకుండా ఇంకెంత కాలం రైతులను యాతన పెడతారని, ఇంకెన్ని చావులు కావాలి, ఇంకెన్ని కుటుంబాలు రోడ్డున పడాలో చెప్పాలని అడిగారు.

ప్రభుత్వ తీరును విమర్శిస్తూ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. “దున్నపోతు మీద వానపడ్డట్టు ప్రవర్తించడం ఆపండి” అంటూ కాంగ్రెస్ సర్కార్‌పై ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి, మంత్రులు సోయి తెచ్చుకోవాలని హితవు పలికారు. ఈరోజు జరగబోయే కేబినెట్ భేటీలోనైనా ధాన్యం కొనుగోలు అంశంపై చిత్తశుద్ధితో చర్చించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న పంట కొనుగోళ్లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అవసరమైన సదుపాయాలు కల్పించడంతో పాటు, తక్షణమే ధాన్యం సేకరించి అన్నదాతల తిప్పలు తప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. కేటీఆర్ చేసిన ఈ ఎక్స్ పోస్ట్ ప్రస్తుతం తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.