Mamata Banerjee: కోల్‌కతాలో 31 ఏళ్ల వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) సర్కార్‌ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర పోలీసుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని సాక్ష్యాత్తు కలకత్తా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే ప్రతిపక్ష పార్టీ బీజేపీ మమతా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. న్యాయం చేయాలని అక్కడి ప్రజలు చేస్తున్న ఆందోళనల్ని పోలీసులతో అణిచివేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుండటంపై బెంగాల్ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు.
Read Also: INS Arighat: ఐఎన్ఎస్ అరిఘాత్.. భారతదేశ రెండో అణు జలంతర్గామి రేపు ప్రారంభం..
ఇదిలా ఉంటే, తృణమూల్ విద్యార్థి విభాగం స్థాపించిన రోజుని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో మమతా బెనర్జీ ప్రతిపక్షాలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బెంగాల్‌లో అశాంతి ఇతర రాష్ట్రాలకు కూడా తీవ్ర పరిణామాలు కలిగిస్తుందని హెచ్చరించారు. ‘‘గుర్తుంచుకోండి బెంగాల్ తగలబడితే, అస్సాం,బీహార్,జార్ఖండ్, ఒడిశా, ఢిల్లీ కూడా తగలబడుతాయి’’ అని హెచ్చరించారు. శాంతిభద్రతల రక్షణలో మమతా బెనర్జీ విఫలమైందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న తరుణంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది.
భారతదేశం, బంగ్లాదేశ్ మధ్య వ్యత్యాసాన్ని చూపుతూ రాష్ట్రాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. ‘‘కొందరు ఇది బంగ్లాదేశ్ అని అనుకుంటున్నారు, దయచేసి గుర్తుంచుకోండి, నేను బంగ్లాదేశ్‌ను ప్రేమిస్తున్నాను, వారు మనలాగే మాట్లాడతారు, మరియు వారి సంస్కృతి మనది వలె ఉంటుంది, కానీ బంగ్లాదేశ్ ఒక ప్రత్యేక దేశం, మరియు భారతదేశం ప్రత్యేక దేశం’’ అని ఆమె చెప్పింది.