Kolkata doctor murder case: కోల్‌కతాలో పీజీ ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఆ రాష్ట్రంలో సంచలనంగా మారింది. అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)పై బీజేపీ ఫైర్ అవుతోంది. ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోల్‌కతాలోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లోని సెమినార్ హాల్‌లో శుక్రవారం ఉదయం మహిళా పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ (పిజిటి) డాక్టర్ సగం నగ్నంగా ఉన్న శరీరం కనుగొనబడింది. మృతురాలు ఛెస్ట మెడిసిన్‌లో రెండో సంవత్సరం చదువుతోంది. డ్యూటీలో ఉన్న సమయంలో ఆమెపై అత్యాచారం చేసి, హత్య చేశారు.
పోస్టుమార్టం నివేదికలో ఆమెపై లైంగిక దాడి జరిగినట్లు తెలిసింది. ఆమె రెండు కళ్లు, నోటి నుంచి రక్తం కారడంతో పాటు చెంపై గోర్లతో రక్కినట్లు, ప్రైవేట్ భాగాల్లో రక్తస్రావం అయినట్లు పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. ఈ కేసులో నిందితుడిని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. అతడిని 14 రోజుల పోలీస్ కస్టడీకి పంపారు. ఘటనాస్థలంలో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన తర్వాత కొంతమంది అనుమానితులను పోలీసులు గుర్తించారు. హత్య జరిగిన సెమినార్ హాల్ దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న సంజయ్ రాయ్ అనే నిందితుడిని గుర్తించారు. అతను తెల్లవారుజామున ఆస్పత్రి నుంచి బయటకు వెళ్లే విజువల్స్ రికార్డ్ అయ్యాయి.
Read Also: Jammu Kashmir: అనంతనాగ్ జిల్లాలో ఎదురుకాల్పులు.. ఇద్దరు సైనికులు మృతి
ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌ని గుర్తించేందుకు ఓ ‘‘బ్లూటూత్’’ హెడ్‌ఫోన్ కీలకంగా మారినట్లు తెలుస్తోంది. హత్య జరిగిన సమీపంలో ఈ హెడ్‌ఫోన్‌ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమానితులను విచారిస్తున్న సమయంలో నిందితుడు సంజయ్ రాయ్ ఫోన్, సంఘటనా స్థలంలో దొరికిన బ్లూటూత్ హెడ్‌ఫోన్ ఆటోమేటిక్‌గా కనెక్ట్ కావడంతో సంజయ్ అసలు నిందితుడని పోలీసులు గుర్తించారు. విచారణ సమయంలో ముందుగా సంజయ్ భిన్నమైన వాదనలు వినిపించాడని, ఆ తర్వాత నేరానికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడని సమచారం.
ఈ కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారనే విషయంపై పోలీసులు విచారిస్తున్నారు. సంజయ్ రాయ్ వృత్తిరీత్యా సివిల్ పోలీస్ వాలంటీర్ అని తెలుస్తోంది. ఆస్పత్రుల్లో చేరిన వారికి సాయం చేయడానికి వీరిని నియమించారు. ఈ హత్య వెస్ట్ బెంగాల్‌లో నిరసనలకు కారణమైంది. పలు ప్రాంతాల్లో డాక్టర్లు నిరసన తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించింది, దోషిగా తేలిన వ్యక్తికి ఉరిశిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చింది. స్ట్ ట్రాక్ కోర్టులో కేసు విచారణ జరిగేలా చూడాలని అధికారులను కోరినట్లు ఆమె తెలిపారు.