కోల్‌కతా వైద్యురాలి హత్యాచార కేసులో నిందితుడైన సంజయ్ రాయ్‌ను ఉరితీయాలని రక్షాబంధన్ రోజున అతడి సోదరి డిమాండ్ చేసింది. సంజయ్ రాయ్ నాలుగు పెళ్లిళ్ల గురించి తనకు తెలియదని చెప్పింది. ఈ విషయం మీడియా ద్వారానే తెలుసుకున్నట్లు ఆమె చెప్పింది.
కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో వైద్యురాలు అత్యంత క్రూరంగా హత్యాచారానికి గురైంది. పౌర వాలంటీర్ సంజయ్ రాయ్‌ను నిందితుడిగా గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పోస్టుమార్గం రిపోర్టును బట్టి గ్యాంగ్‌రేప్ జరిగినట్లుగా భావిస్తున్నారు. దీంతో సీబీఐ రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తోంది. ఒక్కరు చేశారా? లేదంటే ఎక్కువ మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారా? అన్నది దర్యాప్తు సంస్థ తేల్చనుంది. ఇక ఇందులో ప్రధానంగా జీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ పేరు వినిపిస్తోంది. ఇతడిని గత మూడు రోజులుగా సీబీఐ విచారిస్తోంది. తొలుత.. వైద్యురాలు ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. ఇలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందని.. కేసు ఎందుకు పెట్టలేదని.. తల్లిదండ్రులు చూసేందుకు ఎందుకు అనుమతి ఇవ్వలేదని.. అలాగే ఘటనాస్థలి దగ్గర గోడలు ఎందుకు ధ్వంసం చేయించారని పలు ప్రశ్నలు సంధించినట్లుగా తెలుస్తోంది.
ఇక ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. న్యాయం చేయాలని వైద్యులు, నర్సులు డిమాండ్ చేశారు. ఇంకోవైపు ఆస్పత్రుల్లో భద్రత కోసం కేంద్రం కమిటీ వేసింది. ఇక రెండు గంటలకోసారి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు వెళ్లాయి. ఇక తాజాగా నిందితుడు సంజయ్ రాయ్‌కి పాలిగ్రాఫ్ టెస్ట్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ టెస్టు ద్వారా నిజాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.