Kishan Reddy’s comments on TRS over smart cities: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబంపై ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్మార్ట్ సిటీ నిధులపై కేసీఆర్ కుటుంబం అబద్ధాలు చెబుతోందని విమర్శించారు. స్మార్ట్ సిటీ మిషన్ కార్యక్రమం క్రింద తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన రు. 1000 కోట్ల నిధులలో, ఇప్పటి వరకు రు. 392 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందని ఆయన వెల్లడించారు. వరంగల్, కరీంనగర్ నగరాలకు స్మార్ట్ సిటీ మిషన్ పథకం క్రింద విడుదల చేయవలసిన 50 శాతం మ్యాచింగ్ గ్రాంట్ నిధులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పూర్తిగా విడుదల చేయలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం విడుదల చేయవలసిన రూ. 392 కోట్ల మ్యాచింగ్ గ్రాంట్ నిధులలో ఇప్పటి వరకు కేవలం రు. 210 కోట్లను మాత్రమే విడుదల చేసిందని అన్నారు.
స్మార్ట్ సిటీ మిషన్ పథకం ప్రారంభమైన 2015-16 ఆర్థిక సంవత్సరం నుండి కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయిస్తుంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన వాటా మ్యాచింగ్ గ్రాంట్ నిధులను 6 సంవత్సరాలు ఆలస్యం చేసిందని.. చివరకు కేంద్రం ఒత్తిడి మేరకు 2021-22 ఆర్థిక సంవత్సరం నుండి మాత్రమే కేటాయించడం ప్రారంభించిందని వెల్లడించారు. కేంద్రం ఇచ్చిన నిధులను కూడా రాష్ట్రప్రభుత్వం సకాలంలో విడుదల చేయడం లేదని అన్నారు. ప్రభుత్వం సకాలంలో నిధులను విడుదల చేస్తే కరీంనగర్, వరంగల్ నగరాల్లో డ్రైనేజీ పనులు పూర్తయ్యేవని అన్నారు. అమృత్ 2.0 పథకం క్రింద తెలంగాణకు రూ. 2780 కోట్లు ఇచ్చామని అన్నారు. 12 పట్టనాల్లో రూ. 1660 కోట్ల వ్యయంతో 66 ప్రాజెక్టులు చేపట్టామని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వంలోని కీలకమై ఆర్థిక, వైద్య, ఆరోగ్య, రెవెన్యూ, మునిసిపల్, మైనింగ్, పట్టణాభివృద్ధి, ఐటీ వంటి మంత్రిత్వశాఖలు ఒక కుటుంబానికి చెందిన వ్యక్తుల వద్దే ఉన్నాయని కిషన్ రెడ్డి విమర్శించారు. స్మార్ట్ సిటీలకు విడుదల చేసే నిధులపై తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ ఇటీవల సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు.. కేంద్రప్రభుత్వంపై ఏ విధమైన విషప్రచారం సాగిస్తుందో అర్థం అవుతుందని అన్నారు. గత మూడేళ్లుగా స్మార్ట్ సిటీస్ కు కేంద్రం రూపాయి కూడా విడుదల చేయలేదనే ప్రచారాన్ని ఖండించారు. కల్వకుంట్ల కుటుంబ పాలకులు కేంద్ర ప్రభుత్వం మీద నిందలు మోపడం ఆపేసి, రాష్ట్ర ప్రభుత్వ పాలనపై దృష్టిని కేంద్రీకరించాలని కోరుతున్నానని అన్నారు.