Sharad Pawar: రాజీవ్ గాంధీ దేశ ప్రధానిగా ఉన్న సమయంలోనే అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి కీలకమైన ‘శిలాన్యాస్’ నిర్వహించారని నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ అన్నారు. కర్ణాటకలోని నిపానిలో జరిగిన బహిరంగ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ రామ మందిరం పేరిట రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు.
జనవరి 22న అయోధ్యలో రామమందిరి ప్రారంభోత్సవ వేడుక జరగనుంది. ఈ వేడుకకు ముందు ప్రధాని నరేంద్రమోడీ 11 రోజల పాటు ఉపవాసదీక్షను ప్రారంభించారు. అయితే దీనిపై శరద్ పవార్ మాట్లాడుతూ.. రాముడిపై ఆయనకున్న నమ్మకాన్ని నేను గౌరవిస్తాను, కానీ పేదరిక నిర్మూలన కోసం ఆయన ఉపవాసం పాటించాలని నిర్ణయించుకుంటే, ప్రజలు దానిని మెచ్చుకునే వారని అన్నారు.
Read Also: Nepal: త్రిశూలి నదిలో పడిపోయిన ఇండియా నంబర్ ప్లేట్ ఉన్న జీపు.. ప్రాణనష్టమేమీ లేదు..!
రామ మందిర ప్రారంభోత్సవ వేడుక బీజేపీ వర్సెస్ ప్రతిపక్షాలుగా మారింది. ఈ వేడుక కోసం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, అధిర్ రంజన్ చౌదరిలకు రామ మందిర ట్రస్టు ఆహ్వానం పంపింది. అయితే ఇది పూర్తిగా బీజేపీ/ఆర్ఎస్ఎస్ కార్యక్రమమని మేం హాజరుకాబోవడం లేదని కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించింది. రామ మందిర వేడుక ‘మోడీ ఫంక్షన్’ అంటూ రాహుల్ గాంధీ విమర్శించారు. ఇక ఆర్జేడీ, టీఎంసీ వంటి పార్టీలు కూడా బీజేపీపై విమర్శలు ఎక్కు పెట్టాయి. ఇదిలా ఉంటే కాంగ్రెస్ హిందూ వ్యతిరేక ధోరణి ప్రదర్శిస్తోందని బీజేపీ ధ్వజమెత్తుతోంది.
జనవరి 22న జరిగే శ్రీరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ వేడుక కోసం ఆలయ ట్రస్టు దేశవ్యాప్తంగా 7000 మంది ప్రముఖులు, సాధువులకు ఆహ్వానం అందించింది. ఈ రోజు నుంచి అయోధ్యలో ప్రాణప్రతిష్ట కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.