Kerala “Human Sacrifice” Accused Not CPM Members, Says Party:దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ ఇద్దరు మహిళల దారుణహత్య, నరబలి కేసులో ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసు రాజకీయ రంగు పులుముకుంది. ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీలు నిందితులు అధికార సీపీఎం పార్టీకి చెందిన వారని ఆరోపణలు గుప్పిస్తున్నాయి. నరబలి కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురిలో ఇద్దరు సీపీఎం పార్టీలో క్రియాశీలక సభ్యులుగా ఉన్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
Read Also: Kerala: కాంగ్రెస్ ఎమ్మెల్యేపై అత్యాచార ఆరోపణలు.. అజ్ఞాతంలోకి ఎమ్మెల్యే
అయితే కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న విమర్శలపై సీపీఎం స్పందించింది. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఖండించింది. పతినంతిట్ట జిల్లా కార్యదర్శి కేపీ ఉదయభాను మాట్లాడుతూ.. జంట హత్యల కేసులో నిందితులుగా ఉన్న దంపతులు పార్టీ సభ్యులు కాదని.. వారికి పార్టీతో, అనుబంధ సంస్థల్లో ఎలాంటి సభ్యత్వం లేదని తెలిపారు. కేరళ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ నేత వీడీ సతీశన్ మాట్లాడుతూ.. సీపీఎంపై పరోక్షంగా ఆరోపణలు గుప్పించారు. హంతకుల్లో అభ్యుదయవాదులమని చెప్పుకునే పార్టీకి చెందిన వ్యక్తులు ఉన్నారని అన్నారు. హంతకుల్లో ఒకరు సీపీఎం కార్యకర్త అని.. ఈ నేరంలో రాడికల్ మత సమూహాల జోక్యం కూడా ఉందని రాష్ట్ర బీజేపీ చీప్ కే సురేంద్రన్ ఆరోపించారు.
అక్టోబర్ 11న జరిగిన దారుణ హత్యలు, ఇద్దరు మహిళల నరబలి విషయం బయటకు రావడంతో భగవల్ సింగ్(68), అతని భార్య లైలా(59), మహ్మద్ షఫీ(52)లను అరెస్ట్ చేశారు కేరళ పోలీసులు. అయితే నిందితులు ఆ ప్రాంతంలో మార్క్సిస్ట్ పార్టీలో ముఖ్యమైన పదవులు నిర్వహించినట్లు తెలుస్తోంది. దీనికి అనుబంధంగా ఉన్న కర్షక సంఘంలో బాధ్యతలు నిర్వహించారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ను ప్రశంసిస్తూ నిందితుడు ఫేస్ బుక్ పోస్టులు కూడా వెలుగులోకి వచ్చాయి.
