Jackfruit: ‘‘పనస పండు’’ తిని వాహనాలు నడుపుతున్నారా..? అయితే మీరు చిక్కుల్లో పడ్డట్లే. ఒకవేళ పోలీసులు ‘‘డ్రంక్ అండ్ డ్రైవ్’’ టెస్ట్ నిర్వహిస్తే, మీరు మద్యం తాగకున్నా తాగినట్లు రీడింగ్ చూపించే అవకాశం ఉంది. కేరళకు చెందిన ఈ సంఘటనకు పరిశీలిస్తే అసలు విషయం అర్థమవుతుంది. ముగ్గురు ప్రభుత్వ బస్సు డ్రైవర్లు ఇదే విధంగా దొరికారు. వారంతా ఒక్క చుక్క మద్యం ముట్టకున్నా కూడా తాగినట్లు రీడింగ్ వచ్చింది.
పతనంతిట్ట జిల్లాలోని పండలం డిపోలో కేరళ స్టేట్ ఆర్టీసీ బస్సు డ్రైవర్లు మద్యం సేవించి నడిపినందుకు కేసులు నమోదయ్యాయి. అయితే, తాము ఎలాంటి మద్యం సేవించలేదని చెప్పారు. గత వారం జరిగిన ఈ సంఘటనను పరిశీలిస్తే, వీరు బస్సు నడిపే ముందు వీరికి బ్రీత్ అనలైజర్ పరీక్షలు జరిగాయి. అది 10 బ్లడ్ ఆల్కహాల్ రీడింగ్‌ను చూపించింది. దీంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోవడం డ్రైవర్ల వంతైంది. ఈ రీడింగ్ చట్టబద్ధంగా అనుమతించిన పరిధి కన్నా చాలా ఎక్కువ. తాము ఏ విధంగా మద్యాన్ని తీసుకోలేదని చెప్పారు.
Read Also: Air India Crash: యూకేలో బాధిత కుటుంబాలకు రెండు తప్పుడు మృతదేహాలు..
అయితే, గదిలో ఉన్న ఏకైక వస్తువు ‘‘పనస పండు’’పై వీరికి అనుమానం వచ్చింది. పనస పండు అతిగా పండినప్పుడు దాని నుంచి వచ్చు పులియపెట్టిన వాసన బ్రీత్ అనలైజర్లను తప్పుదారి పట్టించినట్లు తేలింది. జాక్‌ఫ్రూట్ బలమైన ఫర్మెంటేషన్ ప్రాసెస్‌కి ప్రసిద్ధి చెందిన ఒక పండు. దీంతో కేఎస్ ఆర్టీసీ అధికారులు మరో ప్రయోగాన్ని నిర్వహించి దీనిని రూఢీ చేసుకున్నారు. పరీక్షల్లో నెగిటివ్ వచ్చిన డ్రైవర్‌కు అదే జాక్‌ఫ్రూట్(పనస పండు) ముక్కలను ఇచ్చి, తినమని కోరారు. ఆ తర్వాత బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ నిర్వహించగా, మద్యం తాగినట్లు రీడింగ్ వచ్చింది. దీంతో అసలు విషయం అధికారులకు అర్థమైంది. బాగా పండిన పనస పండులోని పులియబడిన చక్కెరలు, ఆల్కాహాల్ ఉనికిని సూచించిచాయి. ఈ జాక్ ఫ్రూట్‌ని కొల్లం జిల్లాలోని కొట్టారక స్థానికుడు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.