ఆమ్ ఆద్మీ పార్టీ అంటే గుర్తుకొచ్చేది కేజ్రీవాల్, మనీష్ సిసోడియానే. ఆప్ పార్టీని స్థాపించిన దగ్గర నుంచి ముందుండి విజయ తీరాలకు నడిపించిన నాయకులు. దశాబ్ద కాలం పాటు హస్తినలో చక్రం తిప్పిన నాయకులు. అంతటి ఉద్దండులు.. ఒక్క లిక్కర్ స్కామ్ వారి క్రెడిబిలిటీ మీద దెబ్బ కొట్టింది. ఇంకేముందు తాజా ఫలితాల్లో నేలకొరిగేలా చేసింది. ఓటర్లు కొట్టిన దెబ్బతో కోలుకోలేని స్థితిలో పడ్డారు.
తాజా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ఘోర పరాజయం పొందారు. నూఢిల్లీ నుంచి కేజ్రీవాల్, జంగ్‌పురా నుంచి సిసోడియా ఓటమి పాలయ్యారు. పర్వేష్ వర్మ చేతిలో కేజ్రీవాల్, తర్విందర్ సింగ్ మార్వా చేతిలో సిసోడియా ఓడిపోయారు. ఆప్ అధినేతను 4,000 ఓట్ల తేడాతో పర్వేష్ వర్మ ఓడించారు. బీజేపీ అభ్యర్థి తర్విందర్ సింగ్ మార్వా చేతిలో సిసోడియా 600 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి మాత్రం స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు. కల్కాజీలో బీజేపీ అభ్యర్థి రమేశ్ బిధురిపై అతిషి విజయం సాధించారు.
కొంపముంచిన లిక్కర్ స్కామ్..
కేజ్రీవాల్, సిసోడియా ఓటమికి ప్రధాన కారణం లిక్కర్ స్కామే అని చెప్పక తప్పదు. మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్, సిసోడియా, సంజయ్ సింగ్.. ముగ్గురు జైలుకెళ్లారు. కొన్ని నెలల పాటు జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పార్టీ పరిస్థితి మసకబారింది. ఇక జైలు నుంచి బయటకు వచ్చాక.. ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేసి.. ఆ పీఠంపై నమ్మకస్థురాలైన అతిషిని కూర్చోబెట్టారు. తిరిగి ప్రజలు అధికారం ఇస్తేనే ముఖ్యమంత్రి సీటులో కూర్చొంటానని కేజ్రీవాల్ శపథం పూనారు. తాజా ఫలితాలు చూశాక..కేజ్రీవాల్‌ను విశ్వసించలేదని అర్థమైంది.
అంతేకాకుండా ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ దగ్గర నుంచి అమిత్ షా.. ఇలా బీజేపీ అగ్ర నేతలంతా కేజ్రీవాల్ ‘‘శేష్ మహాల్’’ అంటూ విమర్శలు గుప్పించారు. లిక్కర స్కామ్ డబ్బులతో లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా వీడియోలు, ఫొటోలు వైరల్ చేశారు. ఇవి వేగంగా ప్రజల్లో చొచ్చుకెళ్లాయి. ఇవే కేజ్రీవాల్‌ను కొంపముంచాయని చెప్పక తప్పదు. వాస్తవానికి ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే ఆప్ అభ్యర్థులను ప్రకటించడం.. ప్రజల్లోకి వెళ్లడం జరిగింది. అన్ని వర్గాలకు ఉచిత హామీలు కూడా ఇచ్చేశారు. అయినా కూడా ప్రజలు ఆప్‌ను విశ్వసించలేదు.