బెంగళూరు పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం బెంగళూరులో మాజీ ప్రధాని దేవెగౌడతో పాటు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిని కలిశారు. నేతల మధ్య దేశ రాజకీయాలపై చర్చ జరిగింది.సమావేశం అనంతరం దేశ రాజకీయాలపై, ఆర్థిక వ్యవస్థపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని…వాటిని ఎవరు ఆపలేరని అన్నారు. దేశంతో మార్పు ఖచ్చితంగా ఉంటుందని కేసీఆర్ అన్నారు. రెండు మూడు నెలల్లో సంచలన వార్త చెప్తానని కేసీఆర్ అన్నారు. దేశ, కర్ణాటక రాజకీయాలపై తాము చర్చించినట్లు కేసీఆర్ అన్నారు.
దేశంలో ఎంతో మంది ప్రధానులు వచ్చారని.. అనేక ప్రభుత్వాలు ఏర్పడ్డాయని అయినా దేశ పరిస్థితులు బాగుపడలేదని ఆయన అన్నారు. మనకన్నా వెనకబడి ఉన్న చైనా 16 ట్రిలియన్ ఎకానమీగా ఉందని.. ఇండియా మాత్రం 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ కలలు కంటోందని ఆయన అన్నారు. దేశంలో మానవ వనరులు ఉన్నాయని.. మంచి నేతలు, మంచి వాతావరణ పరిస్థితులు, నదుల్లో నీరు ఉందని కానీ ఇప్పటికీ మనం తాగునీరు, సాగునీరు, కరెంట్ సమస్యలతో దేశం సతమతం అవుతోందని అన్నారు.
మనతో పాటు స్వాతంత్య్రం పొందిన అన్ని దేశాలు డెవలప్ మెంట్ లో ముందుకు వెలుతున్నాయని.. దేశంలో గిరిజనులు, రైతులు, ఎస్సీలు ఎవరూ సంతోషంగా లేరని అన్నారు. ద్రవ్యోల్భనం రోజురోజుకు పెరుగుతోందని.. జీడీపీ పడిపోయిందని, కంపెనీలు మూతపడుతున్నాయని.. తొలిసారిగా రూపాయి విలువ దారుణంగా పడిపోయిందని సీఎం కేసీఆర్ అన్నారు.