Site icon NTV Telugu

Katchatheevu Row: “కచ్చతీవు ద్వీపం”పై బీజేపీ వర్సెస్ డీఎంకే.. తమిళనాడు ఎన్నికల్లో ఎందుకు కీలకమైంది..?

Katchatheevu Row

Katchatheevu Row

Katchatheevu Row: భారత్-శ్రీలంక మధ్య ఉన్న కచ్చతీవు ద్వీపం ఇప్పుడు ఎన్నికల్లో ప్రధానాంశంగా మారింది. లంక ఆధీనంలో ఉన్న ఈ చిన్న ద్వీపం ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు కే. అన్నామలై ఆర్టీఐ ద్వారా తీసుకున్న సమాచారం కాంగ్రెస్, డీఎంకే పార్టీలను ఇబ్బందుల్లో పడేసింది. 1974లో ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, ఓ ఒప్పందం ప్రకారం ఈ దీవిని శ్రీలంకకు అప్పగించిందని బీజేపీ ఆరోపిస్తోంది.

ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీ ఈ అంశాన్ని హైలెట్ చేశారు. ‘‘కళ్లు తెరిచే ఆశ్చర్యకరమైన కొత్త వాస్తవాలు. కచ్చతీవును కాంగ్రెస్ ఎంత నిర్ద్వంద్వంగా వదులుకుందో వెల్లడిస్తుంది. ఇది ప్రతి భారతీయుడికి కోపం తెప్పించింది. మేము కాంగ్రెస్ ఎప్పటికీ విశ్వసించలేము’’ అని ప్రధాని మోడీ ట్వీట్ చేయడమే కాకుండా, ఈ రోజు జరిగిన మీరట్ సభలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. భారతదేశ ఐక్యత, సమగ్రత, ప్రయోజనాలను కాంగ్రెస్ విధానాలు బలహీన పరిచాయని ఆరోపించారు.

వివాదం ఏంటీ..?

కచ్చతీవు ద్వీపం ఇరు దేశాల మధ్య పాక్ జలసంధిలో వ్యూహాత్మక ప్రాంతంలో ఉంది. ఒకప్పుడు భారత్, శ్రీలంక మధ్య వివాదాస్పద భూభాగం. అప్పట్లో ఈ రెండు బ్రిటీష్ కాలనీలుగా ఉండేవి. అయితే దీనిపై ముందుగా రామనాథపురంలోని రామనాడ్ జమీందారి వద్ద ఉండేది, జమిందారీ విధానం రద్దు కావడంతో ఆ తర్వాత మద్రాస్ ప్రెసిడెన్సీకి హక్కులు వచ్చాయి. అయితే, స్వాతంత్ర్యం అనంతరం ఈ ద్వీపం చుట్టూ ఫిషింగ్ హక్కులపై వివాదం చెలరేగింది.

శ్రీలంక అసమ్మతిని పరిష్కరించడానికి, సంబంధాలను బలోపేతం చేయడానికి ఇందిరాగాంధీ నేతృత్వంలోని ప్రభుత్వం 1974లో ‘‘ఇండో-శ్రీలంక మారిటైమ్ ఒప్పందం’’ ప్రకారం దీనిని శ్రీలంకకు అప్పగించింది. ఆ సమయంలో జనావాసాలు లేని 1.6 కి.మీ పొడవు, 300 మీటర్ల వెడల్పు ఉన్న ఈ భూభాగం ప్రస్తుతం వ్యూహాత్మక ప్రాంతంగా మారింది. నానాటికి శ్రీలంకలో చైనా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ఇది కీలకంగా మారింది.

Read Also: Free Beer and Whisky: “పేదవారికి ఉచితంగా విస్కీ, బీర్ ఇస్తాం”.. ఎంపీ అభ్యర్థి విచిత్రమైన హామీ..

తమిళనాడుకు కచ్చతీవు ఎందుకు ముఖ్యం..?

1974లో తమిళనాడులో కరుణానిధి నేతృత్వంలో డీఎంకే అధికారంలో ఉంది. అయితే, ఈ ఒప్పందంలో కాంగ్రెస్ తమ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోలేదని వాదిస్తోంది. అయితే, ఈ రెండు పార్టీలు గత కొన్ని దశాబ్ధాలుగా మిత్రపార్టీలుగా ఉన్నాయి. ప్రస్తుతం తమిళనాడు ఎన్నికల్లో కూడా ఇండియా కూటమి తరుపున ఈ రెండు పార్టీలు పొత్తులో ఉన్నాయి.

జయలలిత అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్యపై ఆమె ధ్వజమెత్తింది. దీనిపై కోర్టుకు కూడా వెళ్లింది. గతేడాది లంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే భారత పర్యటనకు వచ్చిన సమయంలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఈ అంశంపై చర్చించాలని కోరారు. పలువురు మత్స్యకారులను లంక అధికారులు అరెస్ట్ చేసిన తర్వాత ఆయన ప్రధాని మోడీకి లేఖ రాశారు.

తమిళనాడుకు చెందిన మత్స్యకారులు చేపల వేటకు వెళ్లినప్పుడల్లా లంక నేవీ వారిని అరెస్ట్ చేయడం ఇటీవల పరిపాటిగా మారింది. ఈ ద్వీప పరిసర ప్రాంతాలకు వెళ్లగానే లంక అధికారులు అరెస్ట్ చేస్తున్నారు. 2023లో శ్రీలంక నావికాదళం 243 మంది మత్స్యకారులను అరెస్ట్ చేసి 37 బోట్లను సీజ్ చేసింది. గత 28 రోజుల్లోనే ఆరు ఘటనల్లో 88 మంది మత్స్యకారుల్ని అరెస్ట్ చేసి, 12 పడవల్ని పట్టుకున్నారు.

ఈ అంశం ప్రస్తుతం బీజేపీ వర్సెస్ డీఎంకేగా మారింది. డీఎంకే పార్టీ సీనియర్ నేత ఆర్ఎస్ భారతి మాట్లాడుతూ.. ప్రధాని చెప్పడానికి ఎలాంటి విజయాలు లేవని, కేవలం అబద్ధాలను మాత్రమే ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని మోడీకి కచ్చతీవుపై అంత ఆసక్తి ఉండే, 10 ఏళ్ల కాలంలో ఆ ద్వీపాన్ని ఎందుకు తిరిగి స్వాధీనం చేసుకోలేదని ప్రశ్నించారు. దీనిపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. స్నేహపూర్వక సంబంధాల్లో భాగంగానే భారత్, ఈ ద్వీపాన్ని శ్రీలంకకు ఇచ్చిందని పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌తో మోడీ ప్రభుత్వం చేసుకున్న సరిహద్దు ఒప్పందాన్ని ప్రస్తావించారు.

Exit mobile version