NTV Telugu Site icon

DK Shivakumar: బీజేపీకి దగ్గరవుతున్నారన్న ఆరోపణలపై డీకే.శివకుమార్ క్లారిటీ

Dksivakumar

Dksivakumar

శివరాత్రి వేడుకల్లో ఇషా ఫౌండేషన్‌ అధినేత సద్గురు జగ్గీ వాసుదేవ్‌తో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ వేదిక పంచుకోవడం రాజకీయంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. సొంత పార్టీ నేతల నుంచి డీకే.శివకుమార్‌‌పై తీవ్ర వ్యతిరేక వ్యక్తమైంది. ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తితో ఎలా చెట్టాపట్టా్ల్ వేసుకుని తిరుగుతారంటూ డిప్యూటీ సీఎంపై విమర్శలు వెల్లువెత్తాయి. మీ తీరుతో కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయని ఏఐసీసీ కార్యదర్శి మోహన్ అన్నారు. అంతేకాకుండా బీజేపీలో చేరేందుకు దగ్గరవుతున్నారని కూడా విమర్శలు వచ్చాయి.

ఇది కూడా చదవండి: Rythu Bharosa: రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయండి.. అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి ఆదేశాలు!

తాజాగా తనపై వచ్చిన ఆరోపణలపై డీకే.శివకుమార్ క్లారిటీ ఇచ్చారు. మహా శివరాత్రి వేడుకలకు స్వయంగా సద్గురు ఆహ్వానించడంతో మైసూర్ వెళ్లినట్లు తెలిపారు. ఇది తన వ్యక్తిగత నమ్మకం అని చెప్పారు. తాను పుట్టుకతోనే కాంగ్రెస్ వాదినని నొక్కి చెప్పారు. బీజేపీకి దగ్గరవుతున్నట్లు వస్తున్న వార్తలను డీకే.శివకుమార్ కొట్టిపారేశారు. తనను ఆహ్వానించినందుకే కృతజ్ఞతలు చెప్పినట్లు తెలిపారు.

‘‘నేను ఈషా ఫౌండేషన్‌లో జరిగిన మహా శివరాత్రి వేడుకలకు హాజరయ్యాను. అది నా వ్యక్తిగత నమ్మకం. సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేసే ప్రతి ఒక్కరికీ నేను సమాధానం చెప్పలేను. బీజేపీ లేదా ఎవరైనా దానిని స్వాగతించాలని నేను కోరుకోను. మీడియా కూడా దీని గురించి చర్చించకూడదని నేను కోరుకుంటున్నాను. ఇది పూర్తిగా నా వ్యక్తిగత నమ్మకం. సద్గురు మైసూరుకు చెందినవారు. ఆయన నన్ను ఈ కార్యక్రమానికి వ్యక్తిగతంగా ఆహ్వానించారు.’’ అని శివకుమార్ మీడియాతో అన్నారు.

‘‘నేను హిందువుని, అన్ని సంస్కృతులను గౌరవిస్తాను. అందరినీ కలుపుకుని తీసుకెళ్లాలనే సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీకి ఉంది. మహాత్మా గాంధీ, నెహ్రూ, ఇందిరా గాంధీ కూడా అలాగే చేశారు. సోనియా గాంధీ ఉగాది పండుగ జరుపుకోవడం నేను చూశాను. ఆమె మనకంటే భారతీయతను స్వీకరించింది. మనకు అలాంటి నాయకత్వం ఉంది.’’ అని డీకే.శివకుమార్ క్లారిటీ ఇచ్చారు.

‘‘నా నియోజకవర్గంలోని ఓటర్లలో ఎక్కువ మంది షెడ్యూల్డ్ కులాలు మరియు తెగలకు చెందినవారు. నా నియోజకవర్గంలోని 99 శాతం మంది బ్రాహ్మణులు నాకు ఓటు వేస్తున్నారు. బ్రాహ్మణులందరూ బీజేపీకి ఓటు వేస్తారని మనం చెప్పగలమా? నేను కులం, మతం రాజకీయాలు చేయను, కానీ నేను సూత్రప్రాయమైన రాజకీయాలు చేస్తాను.’’ అని డీకే.శివకుమార్ స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Speaker Ayyanna Patrudu: ఏపీ బడ్జెట్‌ 2025-26.. సభ్యులకు స్పీకర్‌ కీలక సూచనలు