Karnataka CM swearing-in ceremony: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 224 స్థానాల్లో ఏకంగా 135 స్థానాలను గెలుచుకుంది. అయితే గెలిచిన తర్వాత సీఎం పీఠం కోసం సిద్దరామయ్య, డీకే శివకుమార్ మధ్య తీవ్ర పోటీ ఎదురైంది. నాలుగు రోజుల హస్తినలో చర్చల తర్వాత సిద్దరామయ్యను కాంగ్రెస్ అధిష్టానం సీఎంగా ప్రకటించింది. డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ను కాంగ్రెస్ అధిష్టానం ఒప్పించింది. మే 20న బెంగళూర్ లో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది.
ఇదిలా ఉంటే 2024 లోక్ సభ ఎన్నికల ముందు బలం పెంచుకునేందుకు, విపక్షాల ఐక్యతను చాటి చెప్పేందుకు కాంగ్రెస్ సిద్ధం అవుతోంది. ఇందుకు కాంగ్రెస్ భావజాలానికి దగ్గరగా ఉన్న పలు లౌకిక పార్టీలను, నేతలను సీఎం ప్రమాణస్వీకారానికి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అన్ని భావజాల పార్టీలకు ఆహ్మానాలు పంపింది. రాహుల్, ప్రియాంకా గాంధీలతో పాటు మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది.
Read Also: Etela Rajender : నేను పార్టీలు మారే వ్యక్తిని కాదు.. బీజేపీ హై కమాండ్ తెలంగాణపై సీరియస్‌గా ఉంది
గెస్ట్ లిస్ట్ ఇదే..
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘెల్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీహార్ సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీయాదవ్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఎన్సీపీ నేత శరద్ పవార్, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లాలకు కాంగ్రెస్ ఆహ్వానాలు పంపినట్లు సమాచారం.
మే 20న మధ్యాహ్నం 12.30 గంటలకు కంఠీరవ స్టేడియంలో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం బీహర్ సీఎం నితీష్ కుమార్ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నరని తెలిసింది. దాదాపుగా 50,000 మంది అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య ఈ ప్రమాణస్వీకారం జరగనుంది. 2018లో కుమారస్వామి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూడా ఇలాగే విపక్షాలు బలప్రదర్శన చేశాయి. ఈ కార్యక్రమానికి మమతా బెనర్జీతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా హాజరయ్యారు. ఆ తరువాత కాంగ్రెస్, జేడీయూకు చెందిన 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో 14 నెలల తర్వాత ప్రభుత్వం కుప్పకూలి, బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది.