బెంగళూరులో రెండో విమానాశ్రయాన్ని నిర్మించబోతున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. శుక్రవారం 2026-27 సంవత్సరానికి గాను రాష్ట్ర బడ్జెట్‌ను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో రాష్ట్రాభివృద్ధి కోసం వివిధ ప్రాజెక్టులు, కొత్త పథకాలు ప్రకటించారు.
కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రద్దీని తగ్గించడానికి బెంగళూరులో రెండవ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు సిద్ధరామయ్య వెల్లడించారు. భారత విమానాశ్రయాల అథారిటీ నుంచి సాంకేతిక సలహా పొందిన తర్వాత సాధ్యాసాధ్యాల నివేదికను రూపొందిస్తామని చెప్పారు. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం భారతదేశంలో మూడవ అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయంగా పేర్కొన్నారు. రద్దీని తగ్గించేందుకు కొత్త ఎయిర్‌పోర్టు నిర్మించాల్సిన అవసరత ఉందని తెలిపారు. కొత్త విమానాశ్రయంతో పాటు రూ.450 కోట్లతో ఓఆర్ఆర్ కూడా అభివృద్ధి చేస్తామి చెప్పారు.
ఇక రాష్ట్రంలోని 7 దేశీయ విమానాశ్రయాల అభివృద్ధికి రూ.1,593 కోట్లను కేటాయించారు. ఈ సంవత్సరంలో రూ.200 కోట్లను ప్రత్యేకంగా కేటాయించారు. ఇక శివమొగ్గ విమానాశ్రయంలో విమాన తయారీ, అసెంబ్లీ కార్యకలాపాలు PPP మోడల్‌లో ప్రారంభించనున్నాయి. ఇక అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, డీమ్‌డ్ యూనివర్శిటీల్లో రోహిత్ వేముల చట్టాన్ని అమలు చేస్తామన్నారు. విద్యార్థులపై కులం ఆధారిత అఘాయిత్యాలను అరికట్టేందుకు ‘రోహిత్ వేయ్ముల చట్టం’’ అమలు చేస్తామని ప్రకటించారు.
