కర్ణాటక ముఖ్యమంత్రిగా ఇటీవలే బసవరాజు బొమ్మై బాధ్యతలు చేపట్టారు. యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్నాక, హోంశాఖ మంత్రిగా పదవీబాధ్యతలు నిర్వహించిన బసవరాజు బొమ్మైకి అవకాశం లభించింది. ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయన తన మంత్రివర్గ విస్తరణపై దృష్టిసారించారు. మంత్రి వర్గంలో భారీ మార్పులు ఉండబోతున్నాయని సమాచారం. ఎవరెవరికి అవకాశం ఇవ్వాలి అనే విషయంపై ఇప్పటికే భారీ కసరత్తులు నిర్వహించారు. మంగళవారం రోజున సీఎం బసవరాజు ఢిల్లీలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డాను కలిసి ఎవరెవరిని మంత్రి వర్గంలోకి తీసుకోవాలనే దానిపై చర్చించారు. అటు అమిత్ షాకు కూడా మంత్రి వర్గ కూర్పుపై వివరణ ఇచ్చినట్టు సమాచారం. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు కర్ణాటక మంత్రివర్గ విస్తరణ ఉండబోతున్నది. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని 20 నుంచి 25 మందిని కేబినెట్‌లోకి తీసుకోబోతున్నారని సమాచారం.