పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు అభిషేక్ బెనర్జీ, కల్యాణ్ బెనర్జీలపై జరిగిన దాడులపై రాజ్యసభ సభ్యుడు, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్య పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ఇలాంటి ఘటనలు జరిగే దేశంలో జీవిస్తున్నందుకు నాకు సిగ్గుగా ఉంది” అని కపిల్ సిబల్ వ్యాఖ్యానించారు.
ఇటీవల సోనార్‌పూర్ పర్యటనలో అభిషేక్ బెనర్జీపై కొందరు వ్యక్తులు రాళ్లు, గుడ్లు విసిరి దుర్భాషలాడిన ఘటన చోటుచేసుకుంది. ఆ తర్వాతి రోజు హూగ్లీ జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్ ఎదుట కల్యాణ్ బెనర్జీని కూడా కొందరు అడ్డుకుని వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలపై స్పందించిన కపిల్ సిబల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఇది పూర్తిగా సిగ్గుచేటు. ఈ దేశంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ ప్రజాస్వామ్య పునాదులను ధ్వంసం చేయడానికి ఏ స్థాయికైనా వెళ్తోంది. ఇలాంటి పరిస్థితులు ఉన్న దేశంలో జీవిస్తున్నందుకు నేను సిగ్గుపడుతున్నాను” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ మండిపాటు
కపిల్ సిబల్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా మాట్లాడుతూ.. ‘‘భారత సుప్రీంకోర్టులో వాదనలు వినిపించి కోట్ల రూపాయలు సంపాదించిన వ్యక్తి ఇప్పుడు భారత్‌లో జీవించడం సిగ్గుగా ఉందంటున్నారు” అంటూ విమర్శించారు. అలాగే 2021లో పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనల్లో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు హతమైనప్పుడు కపిల్ సిబల్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఆర్జీ కర్ ఆస్పత్రి ఘటన, సందేశ్‌ఖాలి వంటి అంశాలపై కూడా ఎందుకు మౌనం పాటించారని ఆరోపించారు. “బీజేపీని వ్యతిరేకించడం ఒక విషయం. కానీ భారత్‌ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? రాజకీయ భేదాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ దేశాన్ని ద్వేషించడం ఎందుకు?” అంటూ పూనావాలా ప్రశ్నించారు.
ఇదిలా ఉండగా అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి సోనార్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. కపిల్ సిబల్ వ్యాఖ్యలు, బీజేపీ ప్రతిస్పందనతో ఈ వ్యవహారం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
#WATCH | Delhi | Over Kapil Sibal's remarks on attack on TMC MP Abhishek Banerjee, BJP National Spokesperson, Shehzad Poonawalla says, "Unfortunately, a person who has made crores of rupees by running his very successful practice in the Supreme Court of India has such a dim view… pic.twitter.com/Ax7D6A94cX
— ANI (@ANI) June 1, 2026
