Kaman Bridge: భారతదేశం, పాకిస్తాన్ మధ్య 6 ఏళ్ల తర్వాత కమాన్ వంతెన తిరిగి తెరుచుకుంది. భారత్-పాక్ విభజన, ఈ రెండు దేశాల మధ్య సంబంధాలకు కేంద్రంగా జీలం నదిపై ఉన్న కమాన్ వంతెన ఉంది. చాలా ఏళ్ల తర్వాత శనివారం ఈ వంతెనను తిరిగి తెరిచారు. జీలం నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న జంట మృతదేహాలను తిరిగి ఇచ్చేందుకు ఈ వంతెనను తెరిచారు. ఇది రాజకీయ ప్రాముఖ్యతతో పాటు మానవతా చర్యగా గుర్తించబడింది.
Read Also: Tech Mahindra: ఖతార్‌లో భారతీయ ఉద్యోగి అరెస్ట్.. “టెక్ మహీంద్రా” ఏం చెప్పింది..?
మార్చి 5న, జమ్మూ కాశ్మీర్ బారాముల్లా జిల్లాలోని బాస్గ్రాన్, కమల్ కోట్ గ్రామాలకు చెందిన యువకుడు, మహిళ జీలం నదిలో విషాదకరంగా ముగనిపోయారు అని ఇండియన్ ఆర్మీ తెలిపింది. 22 ఏళ్ల యువకుడు, 19 ఏళ్ల యువతి మృతదేహాలు నది ప్రవాహం దాటికి సరిహద్దు దాటి పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లాయని అధికారులు తెలిపారు. డెడ్‌బాడీలను వెలికి తీసేందుకు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. యువకుడి మృతదేహం భారత్ వైపు మొదటగా కనిపించింది. మృతదేహాన్ని వెలికితీసే లోపే ప్రవాహంలో ‘‘నియంత్రణ రేఖ(LOC)’’ అవతలకు కొట్టుకుపోయింది. ఇది చివరకు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లోని చినారి సమీపంలో పాక్ వైపు కనిపించింది. అక్కడి అధికారులు డెడ్‌బాడీని స్వాధీనం చేసుకుంది. యువతి మృతదేహం కూడా పీఓకేలో స్వాధీనం చేసుకున్నారు.
వీరి మృతదేహాలను తిరిగి తీసుకురావడానికి ‘‘శాంతి వంతెన’’గా పిలిచే కమాన్ వంతెనను మానవతా దృక్పథంతో శనివారం తెరిచారు. ఇద్దరి మృతదేహాలను సజావుగా తీసుకువచ్చేందుకు భారత్-పాక్ సైనిక అధికారులు సహకరించుకున్నారు. ఈ వంతెనను 2005లో ప్రారంభించారు. అయితే, 2019 ఫిబ్రవరిలో పుల్వామా దాడుల తర్వాత దీనిని మూసేశారు. గతంలో ఈ వంతెన జమ్మూ కాశ్మీర్, పీఓకే మధ్య ప్రజల రవాణాకు ఉపయోగపడేది. ఇరు వైపుల ఉన్న బంధువులు ఒకరినొకరు కలుసుకునేందుకు ఉపయోగపడింది. మూసేసిన 6 ఏళ్ల తర్వాత విషాద ఘటన కారణంగా మళ్లీ శనివారం తెరిచారు.