Site icon NTV Telugu

India-US: “ట్రంప్ భారీ తప్పు చేశాడు, భారతీయులు తలవంచరు”.. సుంకాలపై యూఎస్ ఎక్స్‌పర్ట్..

Trump

Trump

India-US: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై విధించిన 50 శాతం సుంకాలను ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు తప్పుపడుతున్నారు. ఇది రెండు దేశాల మధ్య సంబంధాలను తీవ్రంగా దెబ్బతీస్తోందని హెచ్చరిస్తున్నారు. ప్రముఖ అమెరికన్ అంతర్జాతీయ సంబంధాల నిపుణుడు, చికాగో విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ అయిన జాన్ మెయర్‌షీమర్, ట్రంప్ వైఖరిని తప్పుపట్టారు. ట్రంప్ పరిపాలన భారత విధానాన్ని ‘‘భారీ తప్పు’’గా అభివర్ణించారు. రష్యన్ చమురును కొనుగోలు చేస్తున్న భారత్‌పై సెకండరీ టారిఫ్స్ పనిచేయవని అన్నారు.

Read Also: Uttar Pradesh: మూడు విశ్వవిద్యాలయాలలో 468 కాంట్రాక్ట్, 480 అవుట్‌సోర్సింగ్ పోస్టులకు ఆమోదం

‘‘ ఇది మన వైపు(యూఎస్ఏ) వైపు నుంచి జరిగిన భారీ తప్పు. నమ్మడం కష్టం కానీ, భారత్‌పై ఆంక్షలు పనిచేయవు. రష్యా నుంచి చమురు నిలిపేయబోమని భారతీయులు స్పష్టం చేశారు. భారతీయులు తలవంచరు’’ అని ఆయన గత వారం పాడ్‌కాస్ట్ ఫ్లాట్‌ఫామ్ ‘‘డేనియల్ డేవిస్ డీప్ లైవ్’’తో అన్నారు. ట్రంప్ భారత్‌తో ఉన్న ‘‘అద్భుతమైన’’ సంబంధాలను విషపూరితం చేశారని మెయర్‌షీమర్ ఆరోపించారు. జనవరిలో ట్రంప్ అధికారం చేపట్టినప్పుడు భారత్‌తో యూఎస్ సంబంధాలు అద్భుతంగా ఉన్నాయని, చైనాను నియంత్రించడానికి భారత్‌తో మంచి సంబంధాలు కలిగి ఉండాలని, కానీ ఆంక్షలు, సుంకాలతో భారత్‌తో సంబంధాలను దెబ్బతీశారని ఆయన అన్నారు.

‘‘భారతీయులు మాపై కోపంగా ఉన్నారు. మోడీకి ఫోన్ ట్రంప్ నాలుగు సార్లు ఫోన్ చేయడానికి ప్రయత్నించారు. మోడీ అతడితో మాట్లాడటానికి నిరాకరించారు. మోడీ చైనా, రష్యాకు దగ్గర అవుతున్నారు. ఇది నిజంగా ప్రతీకూలంగా మారింది’’ అని మెయర్‌షీమర్ అన్నారు. వైట్‌హౌజ్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో‌పై కూడా షీమర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తి తప్పుడు చర్యల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి, దీనికి సుఖాంతం ఎలా వస్తుందో అర్థం కావడం లేదని అన్నారు. భారత్‌ని మోకాళ్లపై నిలబెట్టాలని నమ్మిన వారు ఎవరు నాకు తెలియదు, కానీ ప్రతీసారి ఇది తప్పు అని తేలిందని ఆయన అన్నారు.

Exit mobile version