NTV Telugu Site icon

ED: జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్ సన్నిహితుడి ఇంట్లో ఈడీ సోదాలు..

Hemant Soren

Hemant Soren

ED Raids: జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్ సన్నిహితుడి ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాలు నిర్వహిస్తోంది. అక్రమ మైనింగ్ ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఈడీ ఈ రోజు రాంచీ, రాజస్థాన్‌లోని 10 ప్రాంతాల్లో సోదాలు జరుపుతున్నాయి. జార్ఖండ్ సీఎం ప్రెస్ అడ్వైజర్ అభిషేక్ ప్రసాద్‌తో పాటు హజారీబాగ్ డిప్యూటీ ఎస్పీ రాజేంద్ర దుబే, సాహిబ్ గంజ్ జిల్లా కలెక్టర్ రామ్ నివాస్ నివాసాల్లో సోదాలు జరుగుతున్నాయి. రామ్ నివాస్ ఇల్లు రాజస్థాన్‌లో ఉంది.

అంతకుముందు భూ కుంభకోణంతో సంబంధం ఉన్న మరో కేసులో సీఎం సొరెన్ వాంగ్మూలాన్ని నమోదు చేయాలని కోరుతూ ఈడీ శనివారం ఏడోసారి సమన్లు జారీ చేసింది. జార్ఖండ్ సీఎం తన స్టేట్‌మెంట్ రికార్డ్ చేయడానికి ఇదే చివరి అవకాశం అని సమన్లలో ఈడీ పేర్కొంది. అయితే ఈ సమన్లు చట్టవిరుద్ధమని సొరెన్ ఆరోపించారు. తన ఆస్తుల వివరాలను ఇప్పటికే ఇచ్చానని ఈడీకి లేఖ రాశారు. తన ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు ఈడీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

Read Also: BYD: టెస్లాను అధిగమించిన చైనీస్ ఎలక్ట్రిక్ కార్ మేకర్ బీవైడీ..

సాహెబ్ గంజ్ జిల్లా అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ ఆరోపణలపై సీఎం సోరెన్‌పై విచారణ జరుగుతోంది. గనులు, భూగర్భ శాఖలను నిర్వహిస్తున్న సీఎం తనకు తానే మైనింగ్ లీజులు ఇచ్చుకుని ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపించారు.

మరోవైపు సొరెన్ భార్య కల్పనా సొరెన్ గాండే అసెంబ్లీ నియోజవర్గం నుంచి పోటీకి సిద్ధమవుతున్నట్లు బీజేపీ ఆరోపిస్తోంది. దీనికి బలం చేకూరుస్తూ జార్ఖండ్ ముక్తి మోర్చా ఎమ్మెల్యే సర్పరాజ్ అహ్మద్ సోమవారం రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈడీ విచారణలో ఏదైనా పరిణామం ఎదురైతే కల్పనా సొరెన్ గండే నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు బీజేపీ ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణల్ని జేఎంఎం ఖండించింది.