జమ్మూ కాశ్మీర్ రాంబన్ ఖూలీనలాలో నిర్మాణంలో ఉన్న సొరంగం శుక్రవారం కూలింది. జమ్మూ- శ్రీనగర్ మార్గంలో హైవే నిర్మాణ పనుల్లో భాగంగా చేపడుతున్న సొరంగం నిర్మాణం కూలిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో శిథిలాల కింద చిక్కుకున్న10 మంది కూలీలు మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. ఇప్పటి వరకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్లో ఒక్కొక్కటిగా మృతదేహాలు బయటపడ్డాయి. కొండచరియలు విరిగిపడటంతో ఒక్కసారిగా నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిపోయింది. దీంతో అందులో పని చేస్తున్న పది మంది కూలీలు చిక్కుకుపోయారు. అయితే ప్రమాదంలో చిక్కుకున్న మరో ముగ్గురు కూలీలను మాత్రం రెస్క్యూ సిబ్బంది రక్షించింది.
శుక్రవారం నుంచి రెస్క్యూ ఆపరేషన్ మొదలైంది. అయితే శిథిలాల కింద చిక్కుకున్న కూలీలంతా ఊపిరాడక పోవడంతో చిక్కుకున్న కూలీలంతా మరణించారు. ఇప్పటి వరకు తొమ్మిది మృతదేహాలను స్వాధీనం చేసుకోగా… మరో మృతదేహం కోసం రెస్క్యూ కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
కూలీలను రక్షించేందుకు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించించారు. స్వయంగా రక్షణ చర్యలను పర్యవేక్షించారు. అయినా కూడా కూలీల ప్రాణాలు దక్కలేదు. మరణించిన కూలీల 9 మందిలో ఐదుగురు పశ్చిమ బెంగాల్ కు చెందిన వారు కాగా… ఒకరు అస్సాం, ఇద్దరు నేపాల్ కు చెందిన వారు కాగా… ఇద్దరు స్థానిక కూలీలు. అయితే నిర్లక్ష్యానికి కారణం అయిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు రాంబన్ ఎస్ఎస్పీ మోహిత శర్మ వెల్లడించారు.
చనిపోయిన వారినిలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన జాదవ్ రాయ్ (23), గౌతమ్ రాయ్ (22), సుధీర్ రాయ్ (31), దీపక్ రాయ్ (33), పరిమల్ రాయ్ (38), అస్సాంకు చెందిన శివ చౌన్ (26)గా గుర్తించారు. నేపాల్‌కు చెందిన నవరాజ్ చౌదరి (26), కుషి రామ్ (25), స్థానికులు ముజఫర్ (38), ఇస్రత్ (30)లు ఉన్నారు.