Three Lashkar Terrorists Arrested In Jammu And Kashmir: జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవేట కొనసాగుతోంది. తాజాగా ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులను భద్రతా బలగాలు పట్టుకున్నాయి. లష్కరే తోయిబాకు వీరంతా ఓవర్ గ్రౌండ్ వర్కర్లుగా పనిచేస్తున్నారని జమ్మూ కాశ్మీర్ పోలీసులు వెల్లడించారు. 22 రాష్ట్రీయ రైఫిల్స్, సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్ జాయింట్ ఆపరేషన్ లో వీరిని పట్టుకున్నారు. సోపోర్ పోలీసులు శుక్రవారం సాయంత్రం పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమై చౌక్ వద్ద తనిఖీలు చేస్తున్న క్రమంలో లష్కరే తోయిబా ఉగ్రవాదులు దొరికారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. దొరికిన ముగ్గురు ఉగ్రవాదులను షరీఫ్ అష్రఫ్, సక్లైన్ ముస్తాక్, తౌఫీక్ హసన్ షేక్ లుగా గుర్తించారు. తనిఖీలు చేస్తున్న సమయంలో గొరిపురా నుంచి బొమ్మై వైపు వస్తున్న ముగ్గురు వ్యక్తుల కదలికలు అనుమానాస్పదంగా ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో ముగ్గురు పారిపోయేందుకు ప్రయత్నించడంతో భద్రతా బలగాలు పట్టుకున్నాయి. వీరి వద్ద నుంచి మూడు హ్యండ్ గ్రెనెడ్లు, తొమ్మిది పోస్టర్లు, 12 పాకిస్తాన్ జెండాలను స్వాధీనం చేసుకున్నారు.
Read Also: Munawar Faruqui: మునావర్ ఫరూఖీ షోకు అనుమతి నిరాకరించిన ఢిల్లీ పోలీసులు..
అరెస్ట్ అయిన ఉగ్రవాదులు నిషేధిక లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు చెందిన వారు. వీరంతా బయట నుంచి కాశ్మీర్ ప్రాంతానికి వలస వచ్చిన కూలీలు, సాధారణ పౌరులపై, భద్రతా బలగాలపై దాడులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తేలింది. ఇటీవల కాలంలో ఉగ్రవాదులు సామాన్యులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. కాశ్మీర్ హిందువులతో పాటు, ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారిని టార్గెట్ చేస్తున్నారు. ఇటీవల యాపిల్ తోటలో పనిచేసుకుంటున్న వ్యక్తిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. అంతకు ముందు ఇలాగే కాశ్మీర్ పండిట్ రాహుల్ భట్, టీవీ ఆర్టిస్ట్ అమ్రీన్ భట్, ఓ మహిళా ఉపాధ్యాయురాలిని, రాజస్థాన్ కు చెందిన బ్యాంక్ మేనేజర్ తో పాటు బీహార్ ప్రాంతం నుంచి బతుకుదెరువు కోసం వచ్చిన వ్యక్తులను కాల్చి చంపారు. లష్కరే తోయిబాతో పాటు దీనికి అనుబంధంగా పనిచేస్తున్న ది రెసిస్టెంట్ ఫ్రంట్ ఈ దాడులకు తెగబడుతోంది.