జమ్మూలో ఘోర ప్రమాదం జరిగింది. కట్రా నుంచి జమ్మూకు వెల్లే బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు మృతి చెందారు. మరో 22 మంది గాయపడ్డారు. బస్సులో మంటలు చెలరేగిన వెంటనే ఇద్దరు ప్రయాణికులు సజీవ దహనం కాగా… మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలించగా.. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మరణించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇంజిన్ నుంచి మంటలు రావడంతోనే ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మంటలు చెలరేగిన కొద్ది సమయంలోనే బస్సు పూర్తిగా దగ్ధమైంది.
కట్రాలకు 1.5 కిలోమీటర్ల దూరంలో ఖర్మల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ముందుగా బస్సులో పేలుడు సంభవించిందని అంతా భావించారు. కానీ బస్ ట్యాంక్ వేడెక్కడం వల్ల పేలిపోయి ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం క్షతగాత్రులను జమ్మూలోని నరైనా ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందిస్తున్నామని.. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ అన్నారు.
జమ్మూ కాశ్మీరలోని రాజౌరి జిల్లాలో ట్రక్కున ఢీకొనడంతో ప్రయాణికుల బస్సు బోల్తా పడిన సంఘటన జరిగిన రెండు రోజుల్లోనే కట్రా ప్రమాదం జరిగింది. రాజౌరి బస్సు బోల్తా పడిన ఘటనలో 30 మంది గాయపడ్డారు. రాజౌరికి సమీపంలో కాండ్లీ బ్రిడ్జ్ వద్ద టిప్పర్ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.