IT Employees Health: ఐటీ ఉద్యోగుల జీతాలు లక్షల్లో ఉంటాయి. వారి జీతం లక్షల్లో ఉంటే… వారికి వచ్చే వ్యాధులు కూడా అదేస్థాయిలో ఉంటున్నాయి. ఐటీ ఉద్యోగులు ఎక్కువ మంది తీవ్రమైన వ్యాధుల భారిన పడుతున్నారు. 46 శాతం మంది జీవనశైలి వ్యాధులకు గురవుతున్నారని.. 78 శాతం మంది వ్యాయామానికి దూరంగా ఉండటంతో వారు వివిధ రోగాల బారినపడుతున్నట్టు ఒక సర్వేలో తేలింది. ఐటీ ఉద్యోగులు ఒత్తిడితో కూడిన పనివిధానం, అనారోగ్యకర ఆహారపు అలవాట్లు, గంటలకొద్దీ కూర్చొని పనిచేయడం ద్వారా పలు రోగాలను కొనితెచ్చుకుంటున్నారని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్) తెలిపింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఐటీ సంస్థల్లోని 183 మంది ఐటీ ఉద్యోగులపై అధ్యయనం చేయగా.. ఆ వివరాలు అంతర్జాతీయ పీర్ రివ్యూడ్ జర్నల్ ‘న్యూట్రియంట్స్’ ఆగస్టు 2023 సంచికలో ప్రచురితమయ్యాయి. రీసెర్చ్ స్కాలర్ పరోమితా బెనర్జీ పరిశోధన పత్రం ఆధారంగా ఎన్‌ఐఎన్ శాస్త్రవేత్తల బృందం డా. సుబ్బారావు ఎం గవరవరపు, డా. భానుప్రకాష్‌రెడ్డి అధ్యయనం చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎన్‌ఐఎన్ శుక్రవారం మీడియాకు వెల్లడించింది.
Read also: SMA Drug: భారత్లో ఈ మెడిసిన్ ఖరీదు..చైనా, పాక్లకంటే కూడా 15రెట్లు ఎక్కువ రేటు
ఎన్‌ఐఎన్ సైంటిస్టుల అధ్యయనం ప్రకారం ఐటీ ఉద్యోగుల్లో 46 శాతం మంది జీవనశైలి వ్యాధులబారిన పడే ప్రమాదంలో ఉన్నారని తేలింది. ప్రతి 10 మందిలో ముగ్గురు రక్తపోటు, ఊబకాయం, మధుమేహం వంటి వ్యాధులబారిన పడుతున్నారని తెలిపింది. నడుము చుట్టుకొలత ఎక్కువ కలిగిన వారూ జీవనశైలి వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని ఎన్‌ఐఎన్ తెలిపింది. ఐటీ ఉద్యోగుల్లో మగవారిలో 90 సెంటీమీటర్లు(సుమారు 36 అంగుళాలు), ఆడవారిలో 80 సెంటీమీటర్ల(సుమారు 32 అంగుళాలు) చుట్టుకొలత కంటే ఎక్కువ ఉన్నవారు ఉంటున్నారని ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఐటీ సంస్థల్లో ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు అవసరమని ఎన్‌ఐఎన్ ప్రకటించింది. మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామం, తగిన విశ్రాంతి పద్ధతులను అలవర్చడానికి ప్రతి ఐటీ సంస్థలో ఆరోగ్య సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. తరచూ ఆరోగ్య పరీక్షలు చేసుకుంటూ.. తదనుగుణంగా ఆహారపు అలవాట్లు, జీవనశైలిని మార్చుకోవచ్చని తెలిపింది.
Read also: Telangana Rains: తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్డ్
ఐటీ ఉద్యోగులు సగటున 8 గంటల కంటే ఎక్కువ సమయం కూర్చునే పని చేస్తున్నారని ఎన్‌ఐఎన్ తెలిపింది. 78 శాతం మంది వ్యాయామం, శారీరక శ్రమకు దూరంగా ఉన్నారని, కేవలం 22 శాతం మంది ఉద్యోగులు మాత్రమే వారంలో నిర్దేశించిన 150 నిమిషాల పాటు శారీరక శ్రమ చేస్తున్నారని పేర్కొంది. 26 నుంచి 35 ఏళ్ల లోపు వయసు వారు కూడా ఊబకాయం, రక్తపోటు, మధుమేహం బారినపడే పడుతున్నారని హెచ్చరించింది. బయట తినడం, రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయలు తక్కువగా తీసుకోవడం, భోజనంలో సమయపాలన పాటించకపోవడం, లేదంటే భోజనం మానేయడం వంటి అలవాట్లు ఐటీ ఉద్యోగులను దీర్ఘకాలిక వ్యాధులబారిన పడేట్టు చేస్తున్నాయని ఎన్‌ఐఎన్ డైరెక్టర్ డా.హేమలత తెలిపారు. 30 సంవత్సరాలకంటే ఎక్కువ వయసున్న సీనియర్ ఉద్యోగుల్లో ఒత్తిడి అధికంగా ఉందని.. వారిలో జీవనశైలి ప్రమాద కారకాలు ఎక్కువగా కనిపించాయని అధ్యయనం చేసిన శాస్ర్తవేత్తలు తెలిపారు.