NTV Telugu Site icon

High Court: భర్త, సహోద్యోగి మధ్య స్నేహం ‘‘వివాహేతర సంబంధమేనా’’..? భార్య ఆరోపణలపై హైకోర్ట్..

Law News

Law News

High Court: భర్త తన సహోద్యోగితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని భార్య నిర్లక్ష్యంగా ఆరోపించడం మానసిక క్రూరత్వానికి సమానమే అని కలకత్తా హైకోర్టు చెప్పింది. స్త్రీ, పురుషుల మధ్య స్నేహాన్ని, నేటి సమాజంలో అక్రమ సంబంధంగా భావించలేము అని కోర్టు పేర్కొంది. క్రూరత్వం కారణంగా కుటుంబ కోర్టు తనకు విడాకులు మంజూరు చేయడానికి నిరాకరించడంతో భర్త (పిటిషనర్) హైకోర్టులో అప్పీల్ చేశారు. ఈ కేసుని విచారిస్తూ, హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

సహోద్యోగితో వివాహేతర సంబంధం ఉందంటూ భర్తపై భార్య తప్పుడు ఆరోపణలు మానసిక క్రూరత్వానికి సమానమే అని తీర్పు చెప్పింది. భార్య చేసిన నిరాధార ఆరోపణల కారణంగా విడాకుల కోసం భర్త అప్పీల్ చేసిన కేసుని జస్టిస్ సబ్యసాచి భట్టాచార్య, జస్టిస్ ఉదయ్ కుమార్‌లతో కూడిన డివిజనల్ బెంచ్ అనుమతించింది. భార్య చేసిన నిరాధారమైన ఆరోపణల కారణంగా ఇద్దరి వివాహ బంధం కోలుకోలేని విధంగా దెబ్బతిన్నట్లు తీర్పులో పేర్కొంది.

Read Also: Ranveer Allahbadia: యూట్యూబర్ రణవీర్ అల్లాబాడియాపై ఎఫ్ఐఆర్ నమోదు..

స్నేహం కారణంగా మహిళా సహోద్యోగికి, భర్తతో సంబంధాన్ని అంటగట్టడం ఆమోదయోగ్యం కాదని, ఏ స్వతంత్ర సాక్షి కూడా ధ్రువీకరించని సందర్భంలో, ఆరోపణలు నిరాధారమైనవిగా భావించాల్సి ఉంటుందని కోర్టు చెప్పింది. హిందూ వివాహ చట్టం-1955 కింద కుటుంబ కోర్టు అంతకుముందు విడాకులకు నిరాకరించింది. ఎలాంటి ఆధారాలు లేకున్నా భార్య పదేపదే తప్పుడు ఆరోపణలు చేస్తోందని భర్త వాదించాడు. ఇది తనకు తీవ్రమైన మానసిక గాయాన్ని, సమాజంలో పరువుని తీసిందని చెప్పాడు. భార్య తనపై, తన కుటుంబంపై క్రిమినల్ కేసుల్ని పెట్టినట్లు కోర్టుకు తెలిపారు.

భార్య సాక్ష్యాలు అందించడంలో విఫలమైందని, సమాజంలో భర్త ప్రతిష్టని దెబ్బతీసినట్లు హైకోర్టు గుర్తించింది. భర్త దూరమైన ప్రతీసారి, తన వద్దకే రావాలని భార్య క్రిమినల్ ఫిర్యాదులను ఉపయోగిస్తున్నట్లు తేల్చింది. కుటుంబ న్యాయస్థానం ఈ కీలకమైన అంశాలను పరిగణలోకి తీసుకోలేదని, ఇలాంటి సరిదిద్దుకోలేని బంధాన్ని బలవంతం చేయడం సమర్థనీయం కాదని కోర్టు చెప్పింది. ఫ్యామిలీ కోర్టు తీర్పుని పక్కన పెట్టి, ఇద్దరి వివాహాన్ని రద్దు చేస్తూ, విడాకులు ఇచ్చింది.