AI Summit row: ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన AI ఇండియా సమ్మిట్ 2026లో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చొక్కా లేకుండా ప్రదర్శన ఇచ్చిన తీరుపై సాధారణ ప్రజలతో పాటు కాంగ్రెస్ మిత్రపక్షాలు కూడా మండిపడుతున్నాయి. ఇలాంటి ప్రపంచ వేదికలపై రాజకీయాలు చేయడాన్ని విమర్శిస్తున్నారు. శుక్రవారం ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు చొక్కాలు లేకుండా ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. మోడీ ట్రంప్‌కు లొంగిపోయాడంటూ, మోడీ కాంప్రమైజ్ అయ్యాడంటూ నినాదాలు చేశారు.
ఈ వ్యవహారంపై బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అధినేత్రి మరియు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి స్పందించారు. ‘‘ ఈ ప్రదర్శన సరైనది కాదు. అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్ట పెరుగుతున్న తరుణంలో, ఇలాంటి ప్రవర్తన దేశ గౌరవాన్ని దిగజార్చుతుంది’’ అని మండిపడ్డారు. ఏఐ రంగంలో భారత నాయకత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ఇలాంటి వేదికల్ని రాజకీయ నాటకాల కోసం వాడుకోవడం విచారకరమని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇలాంటి ఘటనలు దేశ ప్రతిష్టను దెబ్బతీస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: Chicken chettinad: చికెన్ కర్రీ బోర్ కొడుతుందా, చెట్టినాడ్ స్టైల్‌లో చేయండి లొట్టలేసుకుంటూ తింటారు..
కాంగ్రెస్ మిత్రపక్ష సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా కాంగ్రెస్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ‘‘ రాష్ట్రపతి, ప్రధాన మంత్రితో సహా దేశ, విదేశాలకు చెందిన ప్రముఖులు భారత్ వస్తున్నప్పుడు నకిలీ చైనా రోబోను తీసుకురావడం ప్రభుత్వం తప్పు. ఇదే విధంగా విదేశీ ప్రతినిధుల ముందు దేశం పరువు తీసేలా హంగామా చేయడం కూడా సరికాదు’’ అని వ్యాఖ్యానిచారు.
వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. కాంగ్రెస్ చర్య అందర్ని తలదించుకునేలా చేసిందని, రాజకీయ సిద్ధాంతాలు వేరైనప్పటికీ దేశం విషయంలో అంతా ఐక్యంగా ఉండాలని అన్నారు. టీఆర్ఎస్ నేత కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉందని, ఎక్కడ ఎప్పుడు తెలపాలనేది తెలిసి ఉండాలని, అంతర్జాతీయ వేదికల్ని రాజకీయాల కోసం ఉపయోగించుకోవడం సరైంది కాదని అన్నారు.
