Putin India Visit: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ రోజు(డిసెంబర్ 4)న తన రెండు రోజుల పర్యటన కోసం భారత్ వస్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత రష్యా అధ్యక్షుడు భారత్ రావడం ఇదే తొలిసారి. దీంతో ఈ పర్యటనకు దేశంలోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అయితే, ఇప్పుడు పుతిన్ బస చేయబోతున్న ఐటీసీ మౌర్య హోటల్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పుతిన్ ఈ విలాసవంతమైన హోటల్‌లోనే బస చేయబోతున్నారు.
ఇప్పటికే, రష్యన్ అధికారులతో పాటు భారత భద్రతా అధికారులు హోటల్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. హోటల్ చుట్టూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అన్ని గదులు కూడా ఇప్పటికే బుక్ అయిపోయాయి. హోటల్‌కు వచ్చిపోయే దారుల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు, ఎంట్రీల్లో కఠిన నిఘాను ఉంచారు. అనేక భద్రతా సంస్థలు యాక్సెస్ కంట్రోల్, రాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ఏర్పాటు చేశాయి.

చాణక్య సూట్‌లో పుతిన్:
పుతిన్ ఐటీసీ మౌర్యలోని అత్యంత విలాసవంతమైన ‘‘చాణక్య సూట్’’లో ఉండబోతున్నారు. ఇది ఈ హోటల్‌లో ప్రసిద్ధి చెందిన చంద్రగుప్త సూట్‌కు సమానంగా, అంతే లగ్జరీగా ఉంటుంది. మొత్తం 4600 చదరపు అడుగులు ఉండే ఈ సూట్ అనేక దేశాధినేతలకు గతంలో ఆతిథ్యం ఇచ్చింది. దీని ఖర్చు ఒక్క నైట్‌కు రూ. 8 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ఉంటుంది.
ఈ సూట్ మొత్తం రాజసం ఉట్టిపడేలా ఉంటుంది. సిల్క్ ప్యానెల్ గోడలు, డార్క్ వుడ్ ఫ్లోరింగ్, అనేక హస్తకళా అలంకరణలు ఉంటాయి. భోజనం వడ్డించేందుకు క్రిస్టల్ డి పారిస్ గ్లాస్ వేర్, విల్లెరాయ్ & బోచ్ క్రోకరీ క్రాకరీ ఉంటుంది. పురాతన భారతీయ రాజ వైభవాన్ని, ఆధునిక సౌకర్యాలతో కలగలిపి ఈ సూట్ రూపొందించారు. ఈ సూట్‌లో మాస్టర్ బెడ్రూం, వాక్ ఇన్ క్లొసెట్, ప్రైవేట్ స్టీమ్ రూమ్ అండ్ సౌనా, ప్రైవేట్ జిమ్, పెద్ద రిసెప్షన్, లివింగ్ ఏరియా, 12 మందికి సరిపడే డైనింగ్ రూం, గెస్ట్ రూం, స్టడీ రూం, ఆఫీస్ ప్లేస్ ఉంటుంది.
40 ఏళ్లుగా ప్రపంచ ప్రముఖులకు ఐటీసీ మౌర్య ఆతిథ్యం ఇచ్చింది. ఈ హోటల్ న్యూఢిల్లీ లగ్జరీకి మారుపేరుగా ఉంది. 411 రూంలు, 26 సూట్లు, 9 ప్రీమియం రెస్టారెంట్లు, 5 భారీ బ్యాంక్వెట్ హాల్స్ ఉన్నాయి.