Infosys Layoffs: గ్యాడ్యుయేషన్ పూర్తయిన వెంటనే సగటు వ్యక్తి ఆశ సాఫ్ట్‌వేర్ జాబ్ సంపాదించడం, లక్షల్లో ప్యాకేజీలు అందుకోవడం, ఫ్లాట్లు, కార్లు ఇలా ఎన్నో ఆశలు. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. యువత సాఫ్ట్‌వేర్ ఆశలు ఆవిరి అవుతున్నాయి. గత రెండేళ్లుగా టెక్ కంపెనీలు తమ ఖర్చుల్ని తగ్గించుకునేందుకు వేల సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. తాజాగా, దేశీయ టెక్ దిగ్గజం ‘‘ఇన్ఫోసిస్’’ ఏకంగా 700 మంది ఫ్రెషర్లను ఒకేసారి తొలగించడం సంచలనంగా మారింది.
గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత, రెండేళ్ల తర్వాత 2024 సెప్టెంబర్ నెలలో ఇన్ఫోసిస్‌లో కెరీర్ ప్రారంభించిన వారు, కేవలం 6 నెలల్లోనే నిరుద్యోగులుగా మారారు. ఇన్ఫోసిస్ మైసూర్ క్యాంపస్ నుంచి దాదాపుగా 400 మందికి లేఆఫ్స్ ప్రకటించింది. తొలగించిన వెంటనే క్యాంపస్ నుంచి వెళ్లిపోవాలని కంపెనీ కోరింది. ప్లీజ్ ఈ ఒక్క రాత్రి ఉండనివ్వండి అని ఎంతో దీనంగా వేడుకున్నా యాజమాన్యం కనికరించలేదని బాధితులు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఇంటికి తిరిగి వెళ్లడానికి టాక్సీలు, బస్సులు బుక్ చేసుకుంటున్న సమయంలో తమ జాబ్ పోయిందని తమ తల్లిదండ్రులకు ఎలా తెలియజేయాలని కొందరు కన్నీరుమున్నీరయ్యారు.
Read Also: Donald Trump: భారత్‌పై ‘‘జార్జ్ సోరోస్’’ కుట్రని వెల్లడించిన ట్రంప్..
మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక యువ ట్రైనీ ఫిబ్రవరి 7న ఇన్ఫోసిస్ అధికారులను “దయచేసి నన్ను రాత్రి ఉండనివ్వండి. నేను రేపు బయలుదేరుతాను. ఇప్పుడే నేను ఎక్కడికి వెళ్తాను?” అని వేడుకుంది. ఒకే సారికి వందలాది మందికి ఉద్వాసన పలికిన విషయం సంచలనంగా మారకుండా ఉండేందుకు బస్సులను అడ్డుపెట్టి కవర్ చేసే ప్రయత్నం చేసింది. ఉదయం 9.30 గంటలకు ట్రైనీలను 50 మంది బ్యాచ్‌లుగా పిలిచి, వారి ల్యాప్‌టాప్స్ తీసుకురావానలి కోరారు. గది బయట భద్రతా సిబ్బంది, లోపల బౌన్సర్లను కాపలాగా పెట్టారు.
ఆ రోజు క్యాంపస్‌లో యూఎస్ క్లయింట్స్, సీనియర్ ఉద్యోగులు ఉండటంతో తమను ఉద్యోగాల నుంచి తీసేసే విషయం చాలా గోప్యంగా ఉంచేందుకు సంస్థ ప్రయత్నించిందని మరో బాధితుడు వెల్లడించాడు. మమ్మల్ని లోపలకు పిలిచి ఒక్కొక్కరిగా తొలగించేటప్పుడు బస్సుల్ని షీల్డులుగా ఉపయోగించారని, ఎవరి దృష్టిని ఆకర్షించకుండా మమ్మల్ని బయటకు తీసుకెళ్లారని చెప్పారు. ఇలా తొలగించడాన్ని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. వీరిపై సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఇన్ఫోసిస్ తన ప్రకటనలో.. ‘‘ఇన్ఫోసిస్‌లో కఠినమైన నియామక ప్రక్రియ ఉంది. ఫ్రెషర్లు, మా మైసూర్ క్యాంపస్‌లో విస్తృతమైన ప్రాథమిక శిక్షణ పొందిన తర్వాత ఇంటర్నల్ అసెస్మెంట్ క్లియర్ చేయాలి. ప్రెషర్లు అసెస్మెంట్స్ క్లియర్ చేయడానికి మూడు ఛాన్సులు ఉన్నాయి. విఫలమైతే వారు సంస్థలో కొనసాగలేరు. వారి ఒప్పందంలో కూడా ఈ విషయాలను పేర్కొన్నాము. ఈ ప్రక్రియ రెండు దశాబ్దాలకు పైగా ఉంది. మా క్లయింట్స్ అధిక నాణ్యత, ప్రతిభను ఆశిస్తారు’’ అని చెప్పింది. అయితే, 2024 బ్యాచ్‌కి ఈ ప్రమాణాలను కఠినతరం చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.