Site icon NTV Telugu

Indus Waters Treaty: భారత్ ‘‘రావి’’ దెబ్బ.. పాకిస్తాన్‌లో నీటి సంక్షోభం ఖాయం..

Indus Water

Indus Water

Indus Waters Treaty: ఈ వేసవిలో దాయాది దేశం పాకిస్తాన్ తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కోబోతోంది. ‘‘రావి’’ నీటి కుళాయిని భారత్ మూసివేసింది. ఇన్నాళ్లు ‘‘ఇండస్ వాటర్ ట్రిటీ’’ని అడ్డుపెట్టుకుని భారత వాటా నీటిని కూడా ఎంజాయ్ చేసిన పాకిస్తాన్‌కు అసలు దెబ్బ తగలబోతోంది. సిందు జలాల ఒప్పందం నిలిపేయడంతో ఇప్పటికే పాక్ సతమతమవుతున్న సమయంలో, మార్చి 31 నాటికి షాపూర్ కండి ప్రాజెక్టును పూర్తి చేయాలని భారత్ అనుకుంటోంది. దీనికి రావి నది నుంచి అదనపు నీటి ప్రవామాన్ని నిరోధించింది. భారత్ వైపు రావి నదిపై ఇన్నాళ్లు సరైన ప్రాజెక్టులు లేకపోవడంతో పాకిస్తాన్ భారత్ వాటా నీటిని కూడా వాడుకుంది. ఈ ఏప్రిల్ నుంచి మాత్రం పాకిస్తాన్‌ నీటి సంక్షోభంతో విలవిల్లాడాల్సిందే. జమ్మూ కాశ్మీర్‌లోని కథువా, సాంబా జిల్లాలకు ఈ ప్రాజెక్టు ద్వారా నీటిని అందించనున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి జావెద్ అహ్మద్ రాణా సోమవారం ప్రకటించారు.

పాక్‌ను ఎలా దెబ్బతీస్తుంది.

ప్రస్తుతం రావి మిగులు జలాలు మాధోపూర్ ద్వారా ప్రవహిస్తున్నాయి. అయితే, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ మధ్య దశాబ్ధాలుగా ఉన్న రాజకీయ నిర్లక్ష్యం, గొడవల కారణంగా ఏళ్లుగా నిలిచిపోయిన షాపూర్ కండి బ్యారేజీ నీటి వృధాను అరికడుతుంది. ప్రస్తుతం పాక్ వైపు వెళ్తున్న సింధు నీటిని నిలిపేసి భారత్ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తామని కేంద్ర జల వనరుల మంత్రి సీఆర్ పాటిల్ వారం క్రితం చెప్పారు.

సింధు నది వ్యవస్థలో మూడు తూర్పు నదుల్లో ఒకటైన రావి నీటిపై భారత్‌కు సంపూర్ణ హక్కులు ఉన్నాయి. 1960లో ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో సింధు జలాల ఒప్పందం జరిగింది. దీని ద్వారా తూర్పు నదులైన సట్లేజ్, బియాస్, రావిపై హక్కులు ఉన్నాయి. పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్‌పై పాక్‌కు హక్కులు కల్పించబడ్డాయి. అయితే, తూర్పు నదులపై సరైన ప్రాజెక్టులు లేకపోవడంతో ఇన్నాళ్లు పాక్ మన వాటా నీటిని కూడా దర్జాగా వాడుకుంది. ఇప్పుడు ఈ పరిస్థితి మోడీ ప్రభుత్వం మార్చేసింది.

పాక్ వ్యవసాయం 80 శాతం సింధు జలాలపై ఆధారపడి ఉంది. భారత్ ఈ ఒప్పందాన్ని నిలిపేసిన తర్వాత పాక్‌లో వ్యవసాయం దెబ్బతింటుంది. లాహోర్, ముల్తాన్ వంటి నగరాల్లో నీటి కొరత ఏర్పడుతుంది.

షాపూర్ కండి బ్యారేజ్:

దీనికి 1979లో ప్రణాళిక వేస్తే, 1982లో ఇందిగా గాంధీ ఫౌండేషన్ స్టోన్ వేశారు. 46 ఏళ్లుగా ఈ ప్రాజెక్టు ముందుకు కదలలేదు. మోడీ ప్రభుత్వం 2018లో రెండు రాష్ట్రాల వివాదాన్ని పరిష్కరించి ప్రాజెక్ట్ పనుల్ని వేగవంతం చేసింది. మార్చి 31, 2026 నాటికి ఇది పూర్తవుతుంది. దీని ద్వారా 32,000 హెక్టార్లకు సాగునీరు అందుతుంది. ఇదే కాకుండా చీనాబ్‌పై హైడ్రో పవర్ ప్రాజెక్టుల్ని, జీలం నదిపై వులార్ బ్యారేజ్ పనుల్ని భారత్ వేగంగా చేస్తోంది. దీని వల్ల పాక్‌కు నీటి కష్టాలు మరింత ఎక్కువ అవుతాయి.

Exit mobile version