IndiGo: అమృత్‌సర్ నుండి అహ్మదాబాద్‌కు వెళ్లే ఇండిగో ఎయిర్‌లైన్స్ పాకిస్తాన్ లోకి వెళ్లింది. ప్రతికూల వాతావరణం కారణంగా లాహోర్ సమీపం వరకు వెళ్లి తిరిగి భారత భూభాగంలోకి వచ్చింది. భారత గగనతలంలోకి తిరిగి వచ్చే ముందు పాకిస్తాన్ లోని గుజ్రాన్ వాలా వరకు వెళ్లిందని పాక్ మీడియా పేర్కొంది. ఫ్లైట్ రాడార్ ప్రకారం.. 454 నాట్ల వేగంతో భారత విమానం శనివారం రాత్రి 7.30 గంటలకు లాహోర్ కు ఉత్తర దిశగా ప్రవేశించి రాత్రి 8.01 గంటలకు భారతదేశానికి తిరిగి వెళ్లినట్లు అక్కడి డాన్ వార్తా పత్రిక నివేదించింది. అయితే ఈ వ్యవహారంపై విమానయాన సంస్థ నుంచి ఎటువంటి స్పందన రాలేదు.
ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్‌ల డేటా ప్రకారం, రాత్రి 7:45 గంటలకు అమృత్‌సర్ నుండి టేకాఫ్ అయిన వెంటనే విమానం దాని మార్గం నుండి తప్పుకుంది. ఇండిగో విమానం గుజ్రాన్‌వాలా మీదుగా ప్రయాణించి, పంజాబ్‌లోని శ్రీ ముక్త్సర్ సాహిబ్ నగరానికి సమీపంలో భారత గగనతలానికి తిరిగి వచ్చింది. బ్యాడ్ వెదర్ కారణంగా ఇలా జరిగింది.
Read Also: Long Covid-19: షుగర్ ఔషధంతో లాంగ్ కోవిడ్‌కు చెక్.. అధ్యయనంలో వెల్లడి..
ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఇలా వేరే దేశ భూభాగంలోకి వెళ్లేందుకు అంతర్జాతీయంగా అనమతించబడిందని ఇది సాధారణమే అని సివిల్ ఏవియేషన్ అధికారులు చెబుతున్నారు. ఇలాగే మే నెలలో పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్(పీఐఏ)కి చెందిన ఓ విమానం ఇలాగే భారత గగనతలంలో 10 నిమిషాల పాటు ప్రయాణించింది. పాకిస్తాన్ లో భారీ వర్షాల కారణంగా, వాతావరణం బాగా లేకపోవడంతో భారత గగనతలంలోకి పాక్ విమానం ప్రవేశించింది. PK248 అనే విమానం మే 4న మస్కట్ నుంచి లాహోర్ లోని అల్లామా ఇక్బాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగే సమయంలో భారీ వర్షం కారణంగా పైలట్ ల్యాండింగ్ చేయలేకపోయాడు. విజిబిలిటీ సరిగ్గా లేకపోవడంతో బోయింగ్ 777 విమానం భారత గగనతలంలోకి వచ్చింది.
ప్రస్తుతం బిపార్జాయ్ తుఫాన్ కారణంగా పాకిస్తాన్ లోని లాహెర్ నగరంలో పరిస్థితులు సరిగ్గా లేవు. శనివారం రాత్రి నుంచి విజిబిలిటీ సరిగ్గా లేకపోవడంతో పలు విమానాలను లాహోర్ నుంచి ఇస్లామాబాద్ కు మళ్లించారు. శనివారం పాకిస్తాన్ లోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. వర్షాల కారణంగా దాదాపుగా 29 మంది ప్రజలు మరణించించారు.