దేశంలో సాధారణ వ్యక్తి దగ్గర నుంచి ధనవంతుడి వరకు ప్రతి ఒక్కడికి అందుబాటు ధరలో ఉండే ఏకైక ప్రయాణం రైల్వే. తక్కువ ధరతో ఎక్కువ దూరం ప్రయాణించాలంటే ఏకైక మార్గం రైల్వే ప్రయాణం. రోజు కోట్ల మందిని రైళ్లు గమ్యస్థానాలకు చేరుస్తాయి. అయితే పండగవేళల్లో ఆ రద్దీ మామూలుగా ఉండదు. అందుకే నెలల ముందే టికెట్స్ బుక్ చేసుకుంటారు.
ప్రయాణికులకు మరింత మెరుగైన ప్రయాణ సౌకర్యం అందించేందుకు కేంద్రం వందే భారత్ రైళ్లు తీసుకొచ్చింది. దీంతో ప్రయాణ సమయం భారీగా తగ్గింది. అయితే వందే భారత్ రైళ్లు ఇకపై మరింత ఎక్కువ కోచ్‌లతో నడవనున్నాయి. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న రూట్లలో 20 బోగీలతో కూడిన వందే భారత్ రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది.
16 బోగిలు ఉన్న వందే భారత్ రైళ్లకు మరో నాలుగు బోగీలను అదనంగా పెట్టనున్నారు. దీంతో పండగ వేళ రద్ధీని తగ్గించవచ్చని అంటున్నారు. ప్రస్తుతం 144 వందే భారత్ రైళ్లను నడుపుతున్నాయి. వీటిల్లో సీట్లు దాదాపు 100శాతం కంటే ఎక్కువగా నిండిపోతున్నాయి. ఈ పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని రైల్వే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వందే భారత్ రైళ్లలో స్లీపర్ కోచ్‌లు కూడా రాబోతున్నాయి.
ప్రస్తుతం 10 స్లీపర్ రైళ్లు తయారీలో ఉన్నాయి. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ 50 వందే భారత్ స్లీపర్ రేక్‌లను తయారు చేస్తోంది. వీటితో పాటు భవిష్యత్తులో సుదూర ప్రయాణాలకు వీలుగా 200 స్లీపర్ బోగీలను కూడా తయారు చేయనున్నారు. ఈ మార్పులు ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా, రైల్వేల ఆదాయాన్ని కూడా పెంచుతాయి. వందే భారత్ రైళ్లలో బోగీలు పెంచడాన్ని చాలా మంది అభినందిస్తున్నారు. అయినప్పటికి సాధారణ రైళ్లలో జనరల్ బోగీలను పెంచాలని సాధారణ ప్రజలు కోరుతున్నారు.