Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో కిష్త్వార్ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఆదివారం మధ్యాహ్నం నుంచి కాల్పులు ప్రారంభయ్యాయి. సైన్యానికి చెందిన ఏడుగురు సైనికులు ఈ ఆపరేషన్‌లో గాయపడినట్లు తెలుస్తోంది. కఠిమైన పర్వత ప్రాంతాల్లో దాగి ఉన్న ఉగ్రవాదులను ఏరిపారేసేందుకు భద్రతా బలగాలు ఈ ఆపరేషన్ చేపట్టాయి. దీనికి ‘‘ఆపరేషన్ త్రాహి-1’’ అని పేరు పెట్టారు. భారత సైన్యానికి చెందిన వైట్ నైట్ కార్ప్స్ ఈ ఆపరేషన్ చేపట్టింది. చత్రూ ప్రాంతంలోని సొన్నార్‌లో తనిఖీలు చేపడుతున్న సమయంలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి.
Read Also: IND vs NZ: రోహిత్ శర్మ 2027 ODI వరల్డ్ కప్‌కు దూరమవుతాడా?.. ODI సిరీస్‌లో ఘోరంగా విఫలం
పాకిస్తాన్‌కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాదులు ఇద్దరు, ముగ్గురు ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. భద్రతా బలగాల వలయాన్ని ఛేదించేందుకు ఉగ్రవాదులు గ్రెనేడ్లు విసిరినట్లు చెప్పారు. దీనికి ప్రతిగా సైన్యం దాడుల్ని పెంచిందని, గాయపడిన సైనికుల్ని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు చెప్పారు. భారత సైన్యం, సీఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసుల్ని మోహరించారు. డ్రోన్లు, స్నిఫర్ డాగ్స్‌ను ఉపయోగించి ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఇది ఈ ఏడాది మూడో ఎన్‌కౌంటర్. జనవరి 7, 13 తేదీల్లో కథువా జిల్లాలో కహోగ్, నజోటే అటవీ ప్రాంతాల్లో ఎదురుకాల్పులు జరిగాయి. రిపబ్లిక్ డే సమీపిస్తున్న తరుణంలో పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని దేశంలోకి పంపే ప్రయత్నాలు చేస్తున్నట్లు నిఘా సమచారం ఉంది. దీంతో భద్రతా బలగాలు కౌంటర్ టెర్రర్ ఆపరేషన్లను పెంచింది.
