Space station: 2035 నాటికి భారత్‌కి సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పడుతుందని, ఇది అంతరిక్ష విషయాలను కనుగొనేందుకు, అధ్యయనం చేసేందుకు దోహదపడుతుందని ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు అన్నారు. తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం(వీఎస్ఎస్సీ)లో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. భవిష్యత్తులో భారత వ్యోమగామని సొంత రాకెట్ ద్వారా చంద్రుడిపై దిగుతారని చెప్పారు.
21వ శతాబ్ధంలో భారతదేశం డైనమిక్ గ్లోబల్ ప్లేయర్‌గా ఎదుగుతోందని, గణనీయమైన పరోగతిని ప్రదర్శిస్తోందని ఆయన అన్నారు. భారత్ తన శక్తితో ప్రస్తుతం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోందని, గత 10 ఏళ్లలో 400 శాటిలైట్లను ప్రయోగించామని, 10 ఏళ్లకు ముందు 33 ఉపగ్రహాలను మాత్రమే ప్రయోగించామని ప్రధాని వెల్లడించారు. గగన్‌యాన్ మిషన్‌లో ఉపయోగించే పరికరాలు ఎక్కువగా భారతదేశంలోనే తయారు చేయబడటం పట్ల ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. భారతదేశం ప్రపంచంలోనే టాప్-3 ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తున్న తరుణంలో, గగన్‌యాన్ ప్రయోగం చేపట్టడం మన అంతరిక్ష రంగాన్ని కొత్త ఎత్తుకు తీసుకెళ్తుందని ప్రధాని మోడీ అన్నారు.
Read Also: Kejriwal: కేజ్రీవాల్‌కు మళ్లీ ఈడీ నోటీసు.. ఇది ఎన్నో సారంటే..!
2024-25లో భారత్ తొలిసారిగా నిర్వహించబోతున్న మానవ సహిత అంతరిక్ష ప్రయోగం గగన్‌యాన్‌లో భాగమైన నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రధాని మోడీ ప్రకటించారు. గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ నాయర్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్ మరియు వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా ఈ ప్రయోగంలో భాగం కానున్నారు. నలుగురు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పైలట్లు, రష్యాలోని యూరిగగారిన్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షణ పొందారు. గగన్ యాన్ మిషన్ కోసం 400 కి.మీ కక్ష్యలో భారత వ్యోమగాముల్ని ప్రవేశపెట్టనున్నారు. మూడు రోజుల పాటు ఈ ప్రయోగం జరుగుతుంది. ఆ తరువాత వీరిని సురక్షితంగా భూమిపైకి తీసుకురానున్నారు.